Prem Sagar Rao Denies 450 Crore Bank Loan Fraud:  కొన్ని పత్రికల్లో ప్రచురితమైన అవినీతి ,  అక్రమాల కథనాలను మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. తన వ్యక్తిత్వ హననానికి, రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ తప్పుడు ప్రచారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఇసుక, భూముల వ్యాపారాలకు ఎప్పుడూ దూరంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తనపై అసత్య కథనాలు రాస్తున్న వ్యక్తులు, సంబంధిత పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Continues below advertisement

ప్రధానంగా ప్రచారంలో ఉన్న రూ. 450 కోట్ల బ్యాంక్ రుణాల వ్యవహారంపై ఎమ్మెల్యే పక్కా ఆధారాలతో క్లారిటీ ఇచ్చారు. 2009-10 కాలంలో సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేర్లపై బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, అవి తాను సొంతంగా సృష్టించిన పత్రాలు కావని తెలిపారు. 2014 నుంచి 2025 వరకు కంపెనీ ద్వారా వినియోగించిన మొత్తం నిధులు రూ. 109 కోట్ల 11 లక్షలు మాత్రమేనని, అన్ని బ్యాంకులు కూడా అదే మొత్తాన్ని ఎన్‌పీఏ  గా గుర్తించాయని వివరించారు. ఒకవేళ రూ. 450 కోట్ల మేర మోసమే జరిగి ఉంటే బ్యాంకులు కేవలం రూ. 109 కోట్లకు ఆస్తులను ఎలా వేలం వేస్తాయని ఆయన ప్రశ్నించారు.

రుణ చెల్లింపులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, 2014 నుంచి 2025 మధ్య కాలంలో బ్యాంకులకు ఇప్పటికే రూ. 44 కోట్ల 81 లక్షలు చెల్లించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆంధ్ర బ్యాంక్ ఖాతా ఎన్‌పీఏగా మారిన తర్వాత కూడా మరో రూ. 18 కోట్ల 72 లక్షలు చెల్లించామని, 2024 అక్టోబర్ 31 నుంచి నిరంతరంగా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. వ్యాపారంలో ఎదురైన ఒడుదొడుకులను ప్రస్తావిస్తూ.. యూఎస్ ట్రేడింగ్ మార్కెట్ తీవ్ర పతనం కావడం వల్ల తాను వ్యక్తిగతంగా రూ. 160 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని, అయినప్పటికీ బాధ్యతాయుతంగా బ్యాంకు బకాయిలను తీరుస్తున్నట్లు చెప్పారు.

Continues below advertisement

తన సామాజిక, ప్రజా సేవలను గుర్తుచేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా సొంత నిధులతో 15 పాఠశాలలను నిర్మించి విద్యారంగానికి సహాయపడ్డానని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న నాయకులు ధైర్యముంటే ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలని, తాను పూర్తి ఆధారాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అవసరమైతే ఈ వ్యవహారంపై నిజానిర్ధారణ కమిటీ  వేసినా, కమిటీ ముందుకు వచ్చి అన్ని పత్రాలు, సాక్ష్యాధారాలు సమర్పించేందుకు తాను వెనుకాడేది లేదని ప్రకటించారు. 

రాష్ట్ర కేబినెట్ విస్తరణలో తన పేరు  మంత్రి పదవి రేసులోకి వచ్చిన ప్రతిసారీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు స్వపక్ష, విపక్ష నేతలు కావాలనే ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. గత పదేళ్లపాటు తీవ్ర ప్రతికూల పరిస్థితులలో, ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పోరాడిన తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ రాజకీయ కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారుల జాతకాలు బయటపడతాయని, నిజా నిజాలు త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయని  ప్రకటించారు.