KCR Owaisi : భారత రాష్ట్ర సమితి అధికారికంగా రిజిస్టర్ అయింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ డిసైడయ్యారు. కలసి వచ్చే వారినందర్నీ కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా బీఆర్ఎస్‌తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఆయన సన్నిహిత మిత్రుడు, గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కూటమికి సహకారం అందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఈ కీలక పరిణామాల్లో ఎక్కడా కేసీఆర్ వెనుక కనిపించం లేదు. ఇదే అందరిలోనూ చర్చకు కారణం అవుతోంది. ఇంతకూ బీఆర్ఎస్ కు ఓవైసీపీ మద్దతు ఉందా ? లేదా ?. 


కేసీఆర్ జాతీయ పార్టీపై నేరుగా స్పందించని ఓవైసీ !


భారత రాష్ట్ర సమితి విషయంలో మజ్లిస్ విధానం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. తమిళనాడు నుంచి.. కర్ణాటక నుంచి.. పంజాబ్ నుంచి కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి ప్రతినిధులు వచ్చారు కానీ..సొంత రాష్ట్రంలో అనధికారిక మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. దీంతో  మజ్లిస్ అధినేత అసదుద్దీన్ రాష్ట్రంలో ఎలా సహకరించినా జాతీయ స్థాయిలో మాత్రం తన దారిలో తాను నడవాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మజ్లిస్ అధినేత అధికారికంగా తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు  కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్‌తో కలవడానికి ఆయనకు ఇబ్బందేమిటన్నది టీఆర్ఎస్ నేతలకూ అంతుబట్టని విషయం.


మజ్లిస్‌ను విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఓవైసీ !


హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాన్ని పెట్టని కోటగా మార్చుకున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్  కొన్నాళ్లుగా ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారని ఎన్ని విమర్సలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి  ఓటమి రుచి చూపించడంలో మజ్లిస్ ఓట్లే కీలకమయ్యాయి. అక్కడ మజ్లిస్ తరపున ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. బీహార్‌లోనూ గెలిచారు. అలా మజ్లిస్ ముద్ర ఇతర రాష్ట్రాల్లో కనబడుతున్న సమయంలో బీఆర్ఎస్ నీడలో ఎందుకని ఓవైసీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఓవైసీకి కొన్ని మెరుగైన ఫలితాలతోపాటు చాలా చోట్ల కనీస ఓట్లు రాని పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఓవైసీ ఏ మాత్రం నిరాశపడకుండా జాతీయ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. 


మత ముద్ర పడకుండా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా దూరం ఉంచుతున్నారా?


అయితే మజ్లిస్ మద్దతు బీఆర్ఎస్ అధినేతకు ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. వ్యూహాత్మకంగానే మజ్లిస్ ప్రజెన్స్ ఎక్కువగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనబడకుండా చేస్తున్నారని చెబుతున్నారు.మజ్లిస్ అంటే పూర్తిగా ముస్లింలకే పరిమితమైన పార్టీ.  హిందూత్వ రాజకీయాలు ఇప్పుడుజోరుగా నడుస్తున్నాయి. పొరపాటున మజ్లిస్ స్నేహ పార్టీగా ముద్ర పడితే..  బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ దూరంగా ఉంచుతున్నారని.. అవసరమనప్పుడు కలుపుకుంటారని చెబుతున్నారు. 


తెలంగాణలో తన పార్టీని విస్తరించే పనిలో మజ్లిస్ 


మజ్లిస్ అధినేత తన పార్టీకి తెలంగాణలో నమ్మకంగా వచ్చే ఏడు సీట్లను కాకుండాఈ సారి మరో మూడు, నాలుగు సీట్లను పెంచుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని కసరత్తు కూడా  చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. బీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉండటం కన్నా.. వీలైనంత దూరంమెయిన్ టెయిన్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచన్న వ్యూహం అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.