CM KCR : దేశంలో రైతుల తుపాన్ రాబోతుందని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర కాందార్ లోహలో బీఆర్ఎస్ సభ నిర్వహించారు. ఈ సభలో పలువురు స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో లో చేరారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాందేడ్‌ వాసుల ప్రేమ కారణంగా ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో త్వరలో తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరన్నారు. భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్లే హక్కు తనకు ఉందన్నారు. తెలంగాణలో రైతుబంధు, 24 గంటలు కరెంట్ అందిస్తున్నామన్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో బీఆర్ఎస్ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఫడణవీస్‌ చేస్తే మళ్లీ ఇక్కడకు రానన్నారు. తెలంగాణ లాంటి పథకాలు అమలు చేయనంత వరకూ మహారాష్ట్ర వస్తూనే ఉంటానన్నారు.  






బీఆరఎస్ సత్తా ప్రజలకు అర్థమైంది 


గతంలో నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దీంతో బీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇక్కడేం పని అని ఫడణవీస్‌ అంటున్నారని, తెలంగాణలో ఇస్తున్న పథకాలు మహారాష్ట్ర రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు.  మహారాష్ట్రలో దళితులు అనేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో కూడా దళితబంధు అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైనా పేదల బతుకులు మారలేదన్నారు. 


కాంగ్రెస్, బీజేపీలతో మన బతుకులు మారాయా? 


కాంగ్రెస్‌, బీజేపీలతో మన బతుకులు ఏమైనా మారాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ 54 ఏళ్లు, బీజేపీ 14 ఏళ్లపాటు పాలించి ఏం చేశారని నిలదీశారు. అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి భారత్ లో ఉందన్నారు. ఏటా 40 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని, కానీ నేతలు ఆ దిశంగా ఆలోచన చేయడంలేదని విమర్శించారు. దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని, దానితో 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చన్నారు.  రానున్న స్థానిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో కూడా రిజిస్టర్‌ చేయించినట్లు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ గెలిపిస్తే... సమస్యలు పరిష్కరించి చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ గెలిపిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. మరిన్ని సభలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.