Mahabubnagar School Bus News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరదలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఒక చోట భాష్యం టెక్నో స్కూలుకు చెందిన స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 25 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. స్కూలు బస్సు మాచన్‌పల్లి - కోడూరు మధ్య వెళ్తుండగా వరదలో చిక్కుకుంది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అండర్‌ బ్రిడ్జిలో వరద నీరు భారీగా నిలిచి పోయింది. ఆ వరద నీటిలోకి బస్సు వెళ్లడంతో అందులో చిక్కుకుపోయింది. ముందుకు లేదా వెనక్కి బస్సు వెళ్లలేని స్థితిలో డ్రైవర్ వెంటనే విద్యార్థులను క్షేమంగా బయటికి తీశారు. స్థానికులు కూడా వెంటనే స్పందించి నడుము లోతుకు పైగా ఉన్న నీటిలో దిగి పిల్లల్ని బయటకు తీసుకొచ్చేందుకు సాయం చేశారు. తర్వాత స్కూలు బస్సును ట్రాక్టర్‌ ద్వారా బయటికి లాగించారు. రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం
మరోవైపు, ఉత్తరాదిలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అసోంలో వరదలు ముంచెత్తుతుండగా, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నైనిటాల్‌ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఓ బాలికను మాత్రం కాపాడగలిగారు. రామ్‌ నగర్‌ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి ధేలా నదిలో పడిపోయింది. నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ బాలిక మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఆ బాలికను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు.






సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. 


భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ అంతటా జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.  ధేలా నది విపరీతంగా ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. అతివేగం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.