CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత పరిపాలన భవన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి బహిరంగసభ అసక్తిగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి బహిరంగసభ ఇది. అలాగే కూతరు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నుంచి నోటీసులు ఇచ్చిన తర్వాత సీఎం కేసిఆర్ స్పందించలేదు. ఈ సభా వేదికగా ఆయన సీబీఐ, కేంద్రం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంది. సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఈనెల 6న అంటే మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన వివరణ కోరే అవకాశం ఉంది. 


సీఎం పర్యటన ముందస్తు అరెస్ట్ లు, ఖండించిన కాంగ్రెస్ 


సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ సభను అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో  పట్టణంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తామేమి టెర్రలిస్టులం కాదనీ, కేసిఆర్ ది రాచరికపాలనగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వస్తుంటే ప్రజా ప్రతినిధులు కలిసే అవకాశాలు కల్పించాలనీ,  ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే అవకాశాన్ని కల్పించాలని సంపత్ కోరారు. అలాగే పోలీసులు కూడా శృతిమించి ప్రవర్తిస్తున్నారనీ, ఎప్పటికి ఒకే ప్రభుత్వం ఉండదనీ, జాగ్రత్త ఉండాలని సంపత్ హెచ్చరించారు. 


సీఎం టూర్ షెడ్యూల్ 


ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ బయలుదేరి, 12.45 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటారు. అక్కడ ఇంటిగ్రేటెడ్‌  కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. మధ్నాహ్నం 1.15 నిమిషాలకు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ను ప్రారంభిస్తారు. అనంతరం 3.45 నిమిషాలకు భూత్పూర్‌ దారిలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎంవీఎస్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు.  సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటనకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ రాకతో పాలమూరు పట్టణం గులాబీవర్ణం అయింది. పట్టణంలోని జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్ది, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.