LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Mahabubabad LPG: రాజకీయ నాయకులకు ఇచ్చే పోలీస్ ఎస్కార్ట్ ఇప్పుడు సిలిండర్ల వాహనాలకూ ఇవ్వాల్సి వస్తోంది. ఎందుకంటే.. ఎక్కడ కనబడితే అక్కడ ప్రజలు లాగేసుకుని వెళ్లిపోతున్నారు మరి.

Police Escort For LPG Cylinders: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా రాజకీయ నాయకులకు, విదేశీ ప్రతినిధులకు ఇచ్చే తరహాలో గ్యాస్ సిలిండర్ల లారీలకు పోలీసులు వీఐపీ ఎస్కార్ట్ నిర్వహించారు. గత వారం రోజులుగా జిల్లాలో నెలకొన్న తీవ్రమైన ఎల్పీజీ కొరత కారణంగా, గ్యాస్ లారీ రాగానే ప్రజలు ఎగబడతారనే ఆందోళనతో నర్సింహులపేట , దంతాలపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. పెద ముప్పారం, వంతడుపుల వంటి గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ దొరకడం అనేది ఇప్పుడు ఒక మంత్రితో అపాయింట్‌మెంట్ దొరకడం కంటే కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. నర్సింహులపేటలోని గ్యాస్ గోదాం వద్ద వందలాది మంది మహిళలు, వృద్ధులు శనివారం రాత్రి నుంచే చాపలు వేసుకుని రోడ్లపైనే పడిగాపులు కాశారు. సిలిండర్ల లారీ ఎప్పుడు వస్తుందో తెలియక, వస్తే ఎక్కడ తమకు దక్కదో అన్న భయంతో రాత్రంతా అక్కడే జాగారం చేశారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధుల నుంచి సరైన సమాచారం లేకపోవడం, ఈ-కేవైసీ పేరుతో ఓటీపీలు తీసుకున్నా సిలిండర్లు ఇవ్వకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
VIP treatment for LPG cylinders!
— Ashish (@KP_Aashish) May 15, 2026
In Mahabubabad’s Pedda Mupparam village, police escorted gas cylinder vehicles like a VIP convoy amid an acute LPG shortage. With hundreds waiting for delayed cylinders, cops stepped in to prevent chaos and ensure smooth distribution. For many… pic.twitter.com/vGKP8CHLgv
ఆదివారం ఉదయం వరకు కూడా సిలిండర్ల వాహనం రాకపోవడంతో సహనం కోల్పోయిన వినియోగదారులు జాతీయ రహదారి పై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి, వెంటనే సిలిండర్ల లోడ్‌ను తెప్పించారు. లారీ రాగానే జనం మీద పడకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, తమ పర్యవేక్షణలోనే పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు.
నిజానికి గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని కంపెనీలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కొరత తీవ్రంగా ఉంది. గ్యాస్ డెలివరీ బాయ్స్, ఏజెన్సీ సిబ్బంది కుమ్మక్కై, సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు అధిక ధరలకు సిలిండర్లను విక్రయిస్తూ, సామాన్యులకు మాత్రం స్టాక్ లేదు అని చెబుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు అనుమానిస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి అక్రమ దందాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు.
గ్యాస్ దొరక్కపోవడంతో గ్రామాల్లో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. గృహిణులు కట్టెల పొయ్యిలపై వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాలు ప్రకటిస్తున్నా, కనీసం డబ్బులు పెట్టి కొందామన్నా సిలిండర్లు దొరకకపోవడంపై సామాన్యులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















