BJP Candidates List: ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కనపెట్టి అధిష్టానం కొత్తవారిని నియమించాలని భావిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ (Adilabad MP Seat) కోసం 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ సోయం బాపురావ్ ను పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. బాపురావుకు టికెట్ ఇవ్వొద్దంటూ అంతర్గతంగా చర్చలు చేస్తూ అటు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే బీజీపీ ఎమ్మెల్యేలకు సోయంకూ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర బీజేపీలో మళ్లీ లుకలుకలు
ఇటీవల బాసర నుంచి చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బాగానే కలిసి నడిచిన నేతలు ఆదిలాబాద్ లో ప్రధాని సభ వరకు బాగానే ఉన్నారు. ఆ తరువాత మళ్ళీ బీజేపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. బీజేపీ నాయత్వం సోయం బాపురావుకు టికెట్ ఇవ్వద్దని, తాము అనుకున్న నేతలకే ఎంపీ టికెట్ ఇవ్వాలని హైదరాబాద్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు పైరవీలు చేస్తున్నారు. రేసులో ముఖ్యంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, సర్దార్ అభినవ్, శ్రీలేఖ, డా. సుమలత ఇతరులు ఉన్నారు. వీరితో వ్యవహారం సరిపోలేదన్నట్లుగా చివరికి బీజీపీ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడం నగేష్ ను ఢిల్లీ కి తీసుకెళ్ళి రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేర్పించారు. సోయం బాపురావుకు చెక్ పెట్టెందుకు ఆదివాసీ గోండు తెగకు చెందిన గోడం నగేష్ ను రంగంలోకి దింపారు. ఆయనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరారు. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మిగతా నేతలు సైతం ఢిల్లీలో నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు.
( Image Source : PTI )
సోయంకు, నగేష్ కు టికెట్ ఇవ్వొద్దని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ లలో ఎవరికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ ను కలిసి మాట్లాడారు. ముఖ్య నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పగా ఆ నేతలు టికెట్ పై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వారంతా ఢిల్లీలోనే ఉంటూ టికెట్ ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ నేతలతోనూ టచ్ లో ఉంటూ బాపురావ్, నగేష్ కు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో ఉన్న రెండు గిరిజన స్థానా (ST Loksabha Seats)ల్లో ఒకటి మహబూబాబాద్, అయితే రెండవది ఆదిలాబాద్ లో ఆ తెగల ఓటు శాతం ఆధారంగా టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల ప్రభావం ఎక్కువగా ఉందని భావించి మాజీ ఎంపీ నగేష్ కే టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అటు మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ లంబాడీ గిరిజన సంఖ్య అధికంగా ఉంది. ఇలా అధిష్టానం భావించి ఆ ప్రాంతాల్లో ఉన్న నేతలకు అక్కడ మంచి పట్టు ఉందని భావించి వారికి టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదిలాబాద్ లో మాత్రం సోయం బాపురావ్, గోడం నగేష్ ఇద్దరు ఆదివాసీ నేతలకు కూడా టికెట్ ఇవ్వొద్దని ఆ బీజేపి నేతలు పట్టుబట్టారు. నేడో రేపో బీజేపి రెండో జాబితా విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే బీజేపీ అధిష్టానం అదిలాబాద్ ఎంపీ టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.