revanth reddy telangana cm : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏపీ రాజకీయ నేతలకూ ఆహ్వానాలు పంపారు. అయితే ఎవరూ హాజరు కాలేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణస్వీకరానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి మాత్రం సీఎం జగన్ హాజరు కాలేదు. కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ తో పాటు మల్లు భట్టివిక్రమార్కకు కలిపి శుభాకాంక్షలు చెప్పి.. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని కోరుకున్నారు.
ఇక చాలా మంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తారా అని ఎదురు చూశారు. కానీ టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన రావడం లేదని బుధవారమే క్లారిటీ వచ్చింది . అయితే రేవంత్ రెడ్డికి సోషల్ మీడియాలో కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడం చర్చనీయాంశమయింది. ఎట్టకేలకు.. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత.. చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.
అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చెప్పారు.
టీడీపీ నేతలు అనేక మందితో రేవంత్ రెడ్డికి మంచి స్నేహం ఉంది. వారంతా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగానే శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.