Asifabad News : కన్నతల్లి పొత్తిళ్ల నుంచి పసికందును వేరు చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ నెలల పసి బిడ్డను తల్లి నుంచి వేరుచేసి అమ్మేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.  తన బిడ్డను వెంటనే తనకు ఇప్పించాలని ఆర్.ఎం.పి ఇంటి ముందు న్యాయపోరాటానికి దిగింది బాధితురాలు.  తల్లి నుంచి పసికందును వేరు చేసిన ఆర్ఎంపీ మనోహర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘం నాయకులతో పాటు స్థానిక సర్పంచ్ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక మహిళలు పచ్చి బాలింత నుండి పసికందును వేరు చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేయాలని తల్లిని బిడ్డను ఒకటి చేయాలని కోరారు.  న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని మహిళలు ఆమెకు బాసటగా నిలిచారు.  దీంతో పోలీసులు ఆర్ఎంపీపై కేసు నమోదు చేశారు. తల్లి బిడ్డలను సఖీ కేంద్రానికి తరలించారు. 


న్యాయం చేయండి 


"నాకు ఒక నెల క్రితం డెలివరీ అయింది. నాకు భర్త, అత్తమామల సపోర్ట్ లేదు. డెలివరీ అయినప్పుడు ఆర్ఎంపీ మనోహర్ ఒక మహిళను వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చారు. నాకు సపోర్ట్ ఎవరు లేరని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  అయ్యే వరకు పాపను వాళ్ల దగ్గర ఉంచమన్నాను. నాకు ముందు ఒక ఆడ బిడ్డ ఉంది. డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడ వస్తే ఆర్ఎంపీ కలవడం లేదు. పాపను అడిగితే అమ్మేశా అని చెబుతున్నాడు. పోలీసులను ఆశ్రయిస్తే ఇవాళ ఇస్తానని చెప్పాడు. కానీ ఇంకా పాపను ఇవ్వలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే ఇళ్లు తాళం వేసి ఉంది. నాకు నా పాప కావాలి. నేను డబ్బులు తీసుకోలేదు. నేను అడుగుతుంటే దిల్లీలో ఉన్నవాళ్లకు ఇచ్చేశా అని చెబుతున్నాడు. నాకు న్యాయం చేయండి".- మంజుల, బాధితురాలు 


మహిళా సంఘాలు ఆగ్రహం 


ఈ ఘటనపై స్థానిక మహిళా సంఘాలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా బాలింత తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తల్లి బిడ్డను వేరుచేస్తారా అని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని ఆర్ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. మూడు రోజులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని మహిళలు ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.