KTR warns voluntary organizations:  భారత రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పేరుతో సాగుతున్న అనధికారిక సంస్థల కార్యకలాపాలపై తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ సేవా సమితి ,  కేటీఆర్ సేన వంటి పేర్లతో కొందరు వ్యక్తులు ప్రత్యేక గ్రూపులు, సంస్థలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన, తన పేరుతో ఎలాంటి ప్రైవేటు సంస్థల నిర్వహణకు తాను అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తనపై అభిమానం ఉంటే ఆ శ్రమను, ఉత్సాహాన్ని నేరుగా పార్టీ బలోపేతం కోసం బీఆర్‌ఎస్ వేదికగానే ఖర్చు చేయాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.                                   

Continues below advertisement

కేటీఆర్ పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు                       

ఈ తరహా ప్రకటన వెనుక కేటీఆర్ ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఒక నాయకుడి పేరుతో విడివిడిగా సంస్థలు ఏర్పడినప్పుడు, అవి కాలక్రమేణా పార్టీ  కి సమాంతర శక్తులుగా మారే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఈ అనధికారిక సంస్థల పేరుతో ఎవరైనా అక్రమాలకు లేదా వివాదాస్పద పనులకు పాల్పడితే, ఆ మచ్చ నేరుగా నాయకుడికే తగులుతుంది. గతంలో పలువురు రాజకీయ నేతల విషయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనందున, కేటీఆర్ ముందస్తుగా జాగ్రత్త పడి ఇలాంటి  సమాంతర వ్యవస్థల ను ఆదిలోనే నియంత్రించాలని భావిస్తున్నారు.                  

Continues below advertisement

అందరూ పార్టీ కోసమే పని చేసేలా చూసే ప్రయత్నం            

పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత శ్రేణులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం బీఆర్‌ఎస్‌కు అత్యవసరం. నాయకుల వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ వ్యవస్థే బలమైనదని నిరూపించడానికే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ లోపల క్రమశిక్షణను కాపాడటంతో పాటు, క్యాడర్ అంతా కేవలం బీఆర్‌ఎస్ జెండా కిందనే పనిచేసేలా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చేయడం వల్ల పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావుండదని, కార్యకర్తల శక్తి సామర్థ్యాలు కేవలం పార్టీ ప్రయోజనాలకే ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు.                   

ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ టీం 

సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కేటీఆర్ తన పేరును వాడుకుని కొందరు సొంత లాభం కోసం ప్రయత్నిస్తున్నారనే సమాచారంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. తన అనుమతి లేకుండా తన పేరును, ఫోటోలను వాడుకుంటూ సంస్థలు నడిపేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.  అభిమానాన్ని పార్టీ విధేయతగా మార్చుకోవాలన్న కేటీఆర్ పిలుపుతో ఇప్పుడు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది.