NEET Paper Leak Issue BRS Dharna: దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేటి యువత, జెన్-జీ' తరం పవర్‌ను అంచనా వేయడంలో తీవ్రంగా పొరపడుతున్నారని ఆయన మండిపడ్డారు. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా.. విద్యా మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. దేశ యువత స్వరం మారుతోందని, కొత్త ఆలోచనలతో కూడిన ఈ తరం రాజకీయాలను పునర్నిర్మిస్తోందని స్పష్టం చేశారు. నేపాల్, శ్రీలంకల్లో ఇటీవల చోటుచేసుకున్న ప్రజా తిరుగుబాట్లను ఉదాహరణగా చూపుతూ, యువత ఏకమై రోడ్డెక్కితే ఎంతటి నిరంకుశ ప్రభుత్వాలైనా కూలిపోక తప్పదని కేటీఆర్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పాలకులు యవత ఆకాంక్షలను విస్మరిస్తే ఎదురయ్యే పరిణామాలు దారుణంగా ఉంటాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ తరం చావుకు భయపడదు. ఆకలి, నిరుద్యోగం, భవిష్యత్తుపై అభద్రతాభావంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం అడుగడుగునా ఉవ్వెత్తున లేచి మోదీ ప్రభుత్వానికి సవాలు విసరడం ఖాయం. ఈ విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు నిరుద్యోగ సమస్యలతో నలిగిపోతున్న యువతకు ఆసరాగా నిలవాల్సింది పోయి, ప్రచార ఆర్భాటాలకే పరిమితమవడం సరికాదని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రచార శైలిపై నేరుగా ప్రశ్నలు సంధించిన కేటీఆర్.. టీవీల్లో, మీడియాలో ఆర్నెళ్లకోసారి పరీక్ష పే చర్చ పేరుతో ఉపన్యాసాలు దంచే ప్రధాని, దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి ఏళ్ల తరబడి కష్టం ప్రశ్నార్థకంగా మారుతుంటే కేంద్రం మౌనం వహించడం విద్యార్థి లోకాన్ని ద్రోహం చేయడమేనని అన్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ మరియు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారని కేటీఆర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో విద్యార్థుల పోరాటాలను చూసి కేసీఆర్ చలించిపోయారని, విద్యార్థులకు మద్దతుగా అవసరమైతే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటారని ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ దేశ స్వరూపాన్ని మార్చేది, భవిష్యత్తును కాపాడేది యువతే అని కేసీఆర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థి, నిరుద్యోగ పోరాటాలకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను ఇప్పటికే ఢిల్లీకి పంపి నిరసనల్లో భాగస్వాములను చేస్తున్నామని, కేంద్రం దిగివచ్చి విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. యువత ఆగ్రహ జ్వాలలకు కేంద్రం సమాధానం చెప్పుకోక తప్పదని, విద్యార్థుల వైపు నిలబడటమే బీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యత అని కేటీఆర్ పేర్కొన్నారు.
