KTR Davos Tour :  మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న ముగిసింది. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స్సు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైంద‌ని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ టూర్ లో రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేటీఆర్ ప్రకటించారు. 4 రోజుల పర్యటనలో 52 బిజినెస్, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ మీటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. రేపు తన బృందంతో కేటీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నారు.  సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్ లో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడితో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని గతేడాదే ప్రకటించిన ఆ సంస్థ.. తాజాగా మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంది. దీంతో మొత్తంగా 6 డాటా సెంటర్లు హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపై మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 






ప్రపంచ  ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన కేటీఆర్ 


ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో నాలుగు రోజుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దావోస్‌లో  ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్‌’ను ఏర్పాటు చేశారు.  దీనికి ‘తెలంగాణ – ఏ వరల్డ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌’ అని పేరు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న పథకాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహం, తెలంగాణ సాధించిన విజయాలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు.హైదరాబాద్‌ నగరం విశిష్ఠతను వివరిస్తూ, ఇటీవల వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డును గెలుచుకున్నదని  పెవిలియన్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు.  సమావేశానికి వచ్చే వారికి తెలంగాణ ఖ్యాతిని వివరిస్తూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పెవిలియన్‌ ద్వారా ప్రయత్నం చేశారు. 


మరికొంత మంది పెట్టుబడిదారులను తెలంగాకు రావాలని ఆహ్వానం 


ఇప్పటికి వచ్చిన పెట్టుబడులు కాకుండా.. ఫాలో అప్ చేసుకోవాల్సిన విధంగా పలు కీలక మల్టీనేషనల్ కంపెనీలతో చర్చలు జరిపారు.   వ్యూహాత్మక భాగస్వామ్యం  ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధితో పాటు & పరిశోధనలలో సంభావ్య సహకార అవకాశాల గురించి ఆ కంపెనీ సీఈవో సీఈవో కోర్సెరాతో చర్చించారు. మరికొన్ని ముఖ్యమైన కంపెనీల ప్రతినిధులతోనూ చర్చించారు. వారిని తెలంగాణకు ఆహ్వానించారు. ఇప్పుడు జరిపిన చర్చల ఫలితాలు ముందు ముందు కనిపిస్తాయన్న ఆశాభావంతో కేటీఆర్ బృందం ఉంది. 


దావోస్ సమావేశంలో కేటీఆర్ అరుదైన ఘనతను సంపాదించుకున్నారు. అత్యుంత ప్రభావ శీలురైన యువ నేతల్లో ఒకరిగా..  అద్భుతమైన విషయ పరిజ్ఞానంతో.. ప్రసంగించగల నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.