KTR paid tribute to Jyoti Rao Phule :   బడుగు, బలహీన వర్గాలకు చిరస్మరణీయమైన సేవలతో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. కులవివక్ష, అసమానతలపై ఆనాడే ఫూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే సమానత్వం వస్తుందని, సావిత్రిబాయితో కలిసి అందరికి విద్య అందించేందుకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో భవన్‌లో మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందించామన్నారు.                     


అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్‌ జనరల్‌ సీట్లలో సగం బీసీలకే ఇచ్చారని తెలిపారు. తద్వారా బీసీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పారు. కేవలం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ అవకాశాల కోసం కూడా పాటుపడుతున్న పార్టీ తమదని చెప్పారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, వారి నుంచి ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చుచేశామని తెలిపారు. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం కొనసాగిందని చెప్పారు. ప్రతి పాఠశాలను ఇంటర్మీడియట్‌ కాలేజీకి అప్‌గ్రేట్‌ చేశామని, బీసీ విద్యార్థుల కోసం 33 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లో చదువుకునే వారికి రూ.20 లక్షల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇచ్చామన్నారు. ఈ విషయంలో దళిత, గిరిజన, బహుజన, అగ్రవర్ణ పేదలనే వివక్ష చూడలేదని చెప్పారు. టాటాలు, బిర్లాలు మాత్రమే ముఖ్యంకాదని, తాతలనాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని ఆచరణాత్మకంగా వాటికి ఒక్క రూపును, గౌరవాన్ని అందించామని కేటీఆర్ గుర్తు చేశారు.                                                      


యాదవులు, ముదిరాజులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని తమ రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. అదేవిధంగా ఒకప్పుడు ఊపిరి తీసుకునే నేతన్నలను ఈరోజు ఊపిరి పీల్చుకునే విధంగా తయారు చేశామన్నారు. కేసీఆర్‌ పథకాలతో నేత కార్మికులు నిలబడ్డారని, గీత కార్మికులకు సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఎంబీసీల కోసం వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు లాంటి పథకాలు ఆయా వర్గాల దశ మార్చాయని తెలిపారు. రాబోయే మూడేండ్లలో ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబాపూలే సమున్నత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు.