KTR :   ప్రపంచంలోనే అత్యధిక పేదలు భారత్ లో ఉన్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయని, మోడీ హయాంలో జరిగిన గొప్ప అభివృద్ధి ఇది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీార్ ఎద్దేవా చేశారు.  ఆర్ధిక రంగంలో భారత్  నైజీరియా కంటే కూడా వెనకబడిందన్నారు. ప్రపంచ ఆహార సంస్థ విడుదల చేసిన ఆకలి దేశాల జాబితాలో భారత్ 101వ స్థానంలో ఉందని, ఆ జాబితాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే భారత్ వెనకబడి ఉందన్నారు. దేశంలో వ్యవసాయానికి కావాల్సిన అన్ని వనరులు ఉండి కూడా సమర్థవంతమైన  నాయకత్వం లేకపోవడంతో దేశం వెనక్కి పోతోందని మండిపడ్డారు.  సిరిసిల్లలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.





 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కొటిగా ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని  మోడీ ఆధ్వర్యంలో బేచో ఇండియా కార్యక్రమం నడుస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తన మిత్రుడిని ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా చేసేందుకు మోడీ దేశంలోని వ్యవసాయం, విద్యుత్ రంగాలను దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలు దివాళా తీశాయని చెప్పి, తర్వాత ఆ రెండు రంగాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నిందని మండిపడ్డారు. దేశంలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనాలని, అందుకు కావాల్సిన ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని ఫుడ్ సెక్యూరిటీ చట్టంలో ఉందని, అయితే కేంద్రం ఆ చట్టానికి తూట్లు పొడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. 
 
అనాలోచిత అసమర్ధ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు స్థానం దక్కిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయం సంక్షోభంలో పడుతున్నది, కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చింది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంతో పాటు దేశంలోని రైతన్నలంతా గుర్తించాలన్నారు.


రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్ రంగాలు కొత్తలు పుంతలు తొక్కుతున్నాయన్న మంత్రి...రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం, రైతు వేదికలు, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలతో రాష్టంలో పుష్కలంగా పంటలు పండుతున్నాయని తెలిపారు. 50 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం అందుకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. . విద్యుత్ సంస్కరణలు అమలైతే రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరగనుందని చెప్పారు. కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని విభేదాలను పక్కనపెట్టి ఏకోన్ముఖంగా కేంద్రానికి మన నిరసన తెలుపాలని, ఈ విషయం పైన ప్రజలను జాగృతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.