Telangana Municipal Elections Results KTR Reaction: 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని కేటీఆర్ సంతప్తి వ్యక్తంచేశారు.  తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి దక్కిన నిజమైన విజయం కాదని, ఇది కేవలం అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సాధించిన  కృత్రిమ గెలుపు  అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా ప్రవహింపజేసిందని, కానీ ప్రజల మనసులను గెలవడంలో మాత్రం ఆ పార్టీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Continues below advertisement

బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదు! 

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కేటీఆర్ కొన్ని కీలక గణాంకాలను వెల్లడించారు. మొత్తం 2,581 మున్సిపల్ వార్డులలో బీఆర్ఎస్ సుమారు  750 వార్డులను  గెలుచుకుందని, ఇది దాదాపు 30 శాతానికి పైగా సీట్లని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ 40 శాతానికి పైగా ఓటు బ్యాంకును నిలబెట్టుకుందని, దీనిని బట్టి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలం తగ్గలేదని స్పష్టం చేశారు.  మా విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతపడ్డాయి  అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

కాంగ్రెస్‌లను నిలువరించే ఏకైక శక్తి 

కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎదుర్కోగలిగే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రాంతంలో బీజేపీని అడ్డుకోవడానికి తాము సీపీఐతో కలిసి పనిచేసిన చేస్తామని ఆయన ప్రస్తావించారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐకి  షరతుల్లేకుండా మద్దతిస్తామన్నారు.  సింగరేణిని ప్రైవేటీకరణ వైపు నెడుతున్న బీజేపీకి ,  దానికి సహకరిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక అని అన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు చూపినా, సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎందుకు కాపాడుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.      

 జీహెచ్‌ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్ 

ఈ మున్సిపల్ ఫలితాలను పునాదిగా చేసుకుని రాబోయే  జీహెచ్‌ఎంసీ , ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమరోత్సాహంతో వెళ్తామని కేటీఆర్ ప్రకటించారు. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో అధికార పార్టీ చేసే ప్రలోభాలను అడ్డుకుంటామని, అక్కడ ఏం జరుగుతుందో వేచి చూడాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.             రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా సైనికుల్లా పోరాడిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు , సోషల్ మీడియా వారియర్స్  కి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ,  మరింత ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.