BRS Vs Congress: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్ వద్ద నిరసనకు దిగారు. అటు, కాకతీయ కళాతోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.



'మూర్ఖపు నిర్ణయాలు'






ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని.. పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ పేరు వినిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ కక్షతోనే అధికారిక చిహ్నం మార్పు చేస్తోంది. చార్మినార్ ను రాష్ట్రం చిహ్నంలో తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేరిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మార్చడం మూర్ఖపు నిర్ణయమే. చార్మినార్ హైదరాబాద్ ఐకాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్ఎస్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతాం. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోషపడరు. అధికారిక చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.






చిహ్నం ఆవిష్కరణ వాయిదా


మరోవైపు, తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. పలు డిజైన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న కేవలం తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించే అవకాశం ఉంది.  ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా చిహ్నం రూపొందించాలని రేవంత్ భావిస్తున్నారు.  ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని స్పష్టమయింది. అయితే, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అవి తొలగించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం చార్మినార్ వద్ద కేటీఆర్ సహా, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.


Also Read: Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ సంచలన వాంగ్మూలం, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ పని చేశారట!