BRS Vs Congress:   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తనను తాను నల్లమల పులిగా అభివర్ణించుకోవడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ, ఆయన అసలు పులి కాదని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పెంపుడు పిల్లి అని ఎద్దేవా చేశారు. ఏకంగా 4 వేల మంది పోలీసులు, 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల రక్షణ వలయంలో తిరిగే వ్యక్తిని పులి అని ఎలా అంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రేవంత్ రెడ్డిలో ఇంకా ఎందుకు అంత అసహనం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.

Continues below advertisement

రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలు, దోపిడీని తాము వరుస ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలో బయటపెడుతున్నందుకే ఆయనకు ఆ ఉక్రోషం తట్టుకోలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సోదరులు, బామ్మర్ది సాగిస్తున్న అక్రమ వ్యాపారాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమ సొంత వ్యాపారాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న కేటీఆర్.. తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన సీఎం తమ్ముడు కూడా విదేశీ కంపెనీలతో ఏరోస్పేస్ భాగస్వామ్య సంస్థలను స్థాపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

మరోవైపు, తన సొంత వ్యాపార లావాదేవీలపై స్పందిస్తూ కేటీఆర్ సంచలన సవాళ్లు విసిరారు. నేను 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించాను. అది ఇప్పుడు మూడు హోటళ్లుగా మారింది. ఈ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా నమోదు చేశాను. నిబంధనల ప్రకారం వ్యాపారం చేయడం నేరమా?  అని ప్రశ్నించారు. తన ఆస్తులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులపై కూడా సమగ్ర విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇద్దరి ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు జడ్జీకి లేఖ రాయాలని, ఆ విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.

Continues below advertisement

సిరిసిల్ల నేత కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో సిరిసిల్ల ప్రాంతంలో దాదాపు 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉపాధి లేక చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటిస్తారని ఆశించామని, కానీ వారి బాధలను పట్టించుకోకుండా శత్రుదేశంపై దాడికి వెళ్లినట్లు రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. నేతన్నలకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయకుండా వారి పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు.

అధికార మదంతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు పన్నినా అస్సలు భయపడేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని, రేవంత్ కుటుంబ అక్రమాలను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గత మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మాని ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.