KTR issues legal notice to Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్..కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నా ఇంటెలిజెన్స్ పనితీరు గురించి అవగాహన లేదని బండి సంజయ్ పై కేటీఆర్ మండిపడ్డారు. కనీస జ్ఞానం కూడా లేదన్నారు. బండి సంజయ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను నీచమైనవని.. వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. KTR బండి సంజయ్‌కు 48 గంటల్లోగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసులు నమోదు చేసి విచారణ జరుగుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎదుట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా SIT ముందు హాజరయ్యారు. ఆయన తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు కూడా BRS ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BRS నాయకులను రక్షిస్తున్నారని, SIT విచారణపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను మావోయిస్ట్ కార్యకలాపాల పేరుతో ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, BRS నాయకులు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, వారి భర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR), KTR, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత కోసం చీప్ డ్రామా చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతాయుతంగా పని చేయడం.. ఢిల్లీ బాస్‌ల చెప్పులు మోసేంత సులభం కాదని ఎద్దేవా చేశారు. జూన్‌లో, KTR తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై లీగల్ నోటీసు జారీ చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను "నాటకాల కోసం" ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ నోటీసులపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.