KTR On Mynampalli : మల్కాజిగిరి ఎమ్మెల్యే, మరోసారి పోటీ చేయడానికి టిక్కెట్ పొందిన మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. తిరుమలలో హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. తామంతా హరీష్ కు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి హరీష్ రావు.. పార్టీకి పిల్లర్ గా ఉన్నారని ఆయనరపై అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
తిరుమలలో మైనంపల్లి ఏమన్నారంటే ?
మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని హెచ్చరించారు. మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పోటీ చేస్తారని చెప్పారు. సోమవారం తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ట్రంకు డబ్బా, రబ్బరు చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్..రాజకీయంగా ఎంతో మందిని అణిచి వేశావ్. మల్కాజ్ గిరిలో నేను పోటీ చేస్తాను. రాజకీయాలు పక్కన పెట్టైనా మెదక్ లో మా అబ్బాయిని ఎమ్మెల్యే ను చేస్తా’ అంటూ ఘాటుగా స్పందించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాను.. మైనంపల్లి హనుమంతరావు తలచుకుంటే ఏం జరుగుతుందో మంత్రి హరీశ్ రావును చూపిస్తానంటూ శపథం చేశారు. సిద్దిపేటలో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం
మల్కాజిగిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కేసీఆర్ టిక్కెట్ ఖరారు చేశారు. కానీ.. ఆయన కుమారుడు రోహిత్ రావుకు మాత్రం మెదక్ టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుకున్నారని.. అందుకే హరీష్ రావును టార్గెట్ చేశారన్న అభిప్రాయం బీఆర్ఎస్‌లో వినిపిస్తోంది. తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యల్లో.. కేసీఆర్ కుటుంబంపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లాకు చెందిన వారు . తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. తర్వాత మల్కాజిగిరికి మారారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి అవకాశం లభించకపోవడంతో బీఆర్ఎస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారీగాసేవా కార్యక్రమాలు చేయడంలో ముందు ఉండే హన్మంతరావు కుమరుడు కూడా ఇటీవలి కాలంలో మెదక్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన కుమారుడికి మెదక్ నుంచే టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు. ఆమెకే టిక్కెట్ ఖరారు చేశారు. ఈ కారణంగా రోహిత్ రావుకు టిక్కెట్ నిరాకరించారు. అయితే ఏ పార్టీలో ఉన్నా గెలిచి తీరుతారమన్న నమ్మకంతో ఉన్న మైనంపల్లి.. ఇద్దరికీ టిక్కెట్ ఇవ్వకపోతే.. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే... తీవ్ర వ్యాఖ్యలుచేసినట్లుగా తెలుస్తోంది.
మైనంపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వకపోతే.. టిక్కెట్ క్యాన్సిల్ చేసి.. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.