kTR On Central Govt : ఐడీపీఎల్‌ మధ్య నుంచి రోడ్డు వేసుకుంటే ‘పోలీస్‌ కేసులు పెట్టండి..  ఎట్ల వేస్తరు రోడ్లు మేం చూస్తం ’.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.   " నీకు దమ్ముంటే.. నీకు చేతనైతే కేసు పట్టాల్సి వస్తే మున్సిపల్‌ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద పెట్టు. ఇంజినీర్ల మీద, కింద పని చేసే కార్మికుల మీద, చిన్నాచితాక పొట్టకూటి కోసం పని చేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని కేటీఆర్ సవాల్ చేసారు. మీరు కనీసం కొత్తగా పైసా పని చేయరు హైదరాబాద్‌లో.. మేం పని చేస్తుంటే పోలీస్‌ కేసులు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం ఏమిటని కేటీఆర్ మండిపడ్డారు.  


హైదరాబాద్‌ అంతటా మేం అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్‌లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు కడుతున్నామన్నారు. అభివృద్ధి కోసం  కంటోన్మెంట్‌,   కరీంనగర్‌, రామగుండం,  ఆదిలాబాద్‌ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి చెందిన భూములు అవసరం అని.. అవి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేలా చూడాలన్నారు.  వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు కట్టి హైదరాబాద్‌ అంటే భారతదేశంలోనే అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తమదన్నారు. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు. చేతనైతే సహాయం చేయండి.. లేదా కనీసం అడ్డం రాకండి అని సలహా ఇచ్చారు.  


ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నారని   కేటీఆర్‌ ప్రశ్నించారు.   2014లో జన్‌ధన్‌ ఖాతాలు తెరువాలని రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పాడని.. ఒక్కరికైనా రూ.15లక్షల వచ్చాయా? బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు.    2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికీ నల్లాపెట్టి నీరు అందిస్తానని మోదీ అన్నారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని.. ఇంటింటికీ నల్లానీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దానికి ఒకపైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ స్వయంగా రూ.19వేలకోట్ల సాయం చేయమని చెప్పినా 19 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.  
 
దేశాన్ని రామరాజ్యం చెస్తామని చెప్పి.. రావణకాష్టంలా మారుస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇవాళ దేశంలో ఏ వర్గం సంతోషంగా లేకుండా కులాల మధ్య, మతలా మధ్య పంచాయితీలు పెట్టి.. ఒక మతపిచ్చి పెట్టి దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆరోపించారు.   అగ్నిపథ్‌ పథకంలో చేరిన తర్వాత మిలటరీలో బట్టలు ఉతకొచ్చు. కటింగ్‌ చేయొచ్చు. ఎలక్ట్రిషియన్‌ పని చేయొచ్చు. డ్రైవర్‌ పని చేయొచ్చు.. బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్‌ అంటున్నారని కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.  


కైతలాపూర్ ఫ్లైఓవర్‌ను పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.