Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని వేధింపులకు పాల్పడుతుందని కేటీఆర్ సోషల్ మీడియాలో జోస్యం చెప్పారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యాలను అవినీతిని ఎత్తి చూపినందుకు భారత రాష్ట్ర సమితి పైన ఫ్రస్టేషన్, డెస్పరేషన్ లో ఉన్నారని.. కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమేనన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయని జోస్యం చెప్పారు.
మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండాను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్ లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తుందన్నారు. బిజెపి,కాంగ్రెస్, టిడిపి, వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారని ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావడం మనకు అవసరం లేదన్నారు.
ఇలాంటి కుటిల ప్రయత్నాల వలన ప్రజా సమస్యల పైన మనం చేస్తున్న పోరాటం నుంచి పక్కకు జరగవద్దని తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదామని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుకై వారి పైన ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్ రేసింగ్‌లో రూ. 55 కోట్ల గోల్ మాల్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లుగా ఏసీబీకి మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేశారు. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని మున్సిపల్ శాఖ కోరింది. విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. .నిబంధనలు పాటించకుండానే నిర్వహణ సంస్థఎఫ్ఈఓకు రూ.55 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ. 55 కోట్లు చెల్లించారు. కేటీఆర్ ఆదేశాలతోనే తాను నిధుల బదిలీకి అంగీకరించారని అప్పట్లో మున్సిపల్ శాఖ చూసిన ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.