Karnataka Election 2023 Reactions : కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరి దృష్టి తెలంగాణపై పడింది. తెలంగాణలో కర్ణాటక ఎన్నికలపై ప్రభావం ఉంటుందా లేదా అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. దీనిపై కేటీఆర్, రేవంత్ రెడ్డిలు భిన్న స్పందనలు వ్యక్తం చేశారు.
తెలంగాణపై ప్రభావం ఉండదన్న కేటీఆర్
కర్ణాటకలో నూతనంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్.దరిద్రగొట్టు విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే, కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో చూశామని, అదే విధంగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడంలేదన్నారు. భారతదేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలను మరింత ఎత్తుకు ఎదగనిద్దామని, ఆరోగ్యకరమైన పోటీతో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనలో ఇంకా ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందిద్దామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పనైపోయిందన్న రేవంత్ రెడ్డి
గాంధీభవన్‌లో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే , ఏఐసీసీ సెక్రెటరీలు, ఇతర నేతలు సంబరాలు చేసుకున్నారు. కోలార్ సభలో రాహుల్ మాట్లాడిన దానికి రాహుల్‌పై అనర్హత వేటు వేయడం, ఇళ్ళు ఖాలీ చేయించడం కర్ణాటక ప్రజలకు నచ్చలేదన్నారు. అదాని అవినీతిపై మాట్లాడితే రాహుల్‌పై కక్ష సాధించారని మండిపడ్డారు. గులాంనబీ అజాద్ ఎక్స్ ఎంపీ అయి చాలా రోజులు అయిందని.. అయినా ఇళ్ళు ఎందుకు ఖాళీ చేయించలేదని ప్రశ్నించారు. అదానితో తమకు సంబందం లేదంటున్న బీజేపీ.. అదానిని విమర్శిస్తే బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందని అడిగారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఓక్కటే అని ప్రజలు భావిస్తున్నారని.. అందుకే బీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వచ్చే ఏన్నికల్లో బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 9 సీట్లేనన్న రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇరవై ఐదు, ఎంఐఎంకు ఏడు, బీజేపీకి 9 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. మిగతా సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.