Maharashtra Assembly Election Results 2024 | హైదరాబాద్: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్‌కు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించిన మహారాష్ట్ర ప్రజలు హస్తం పార్టీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోయిందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలను సైతం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాశనం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత మండిపడ్డారు. 


జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అసమర్థత వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ మనుగడ కొనసాగిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో రాష్ట్రాల్లో అభివృద్ధికి కారణం అవుతున్న ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తున్నాయని, సిగ్గు లేకుండా విమర్శలు చేస్తూ రాజకీయాలు నడుపుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిందని, అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలంగాణలోనైనా తమను గెలిపించిన ప్రజల కోసం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చటంపై ఫోకస్ చేయాలని హితవు పలికారు. రాజకీయాలు పక్కనపెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి పలు రాష్ట్రాల్లో పటిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులపై దాడి జరిగిన సమయంలో ఇతర రాష్ట్రానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి.







కాంగ్రెస్ గారడీని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు: హరీష్ రావు
మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ నేతలు చేసిన గారడీని మరాఠా ప్రజలు నమ్మలేదని ఎన్నికల ఫలితాలతో స్పష్టం అయ్యిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించిన మహారాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం తెలంగాణలో ఇంకా అమలు చేయకుండా మహారాష్ట్రలో  రూ.3,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇక్కడ రైతు భరోసా ఎగ్గొట్టడం, ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం మహారాష్ట్రలో ప్రభావం చూపాయన్నారు. 



‘రాష్ట్ర ప్రజలు మహారాష్ట్రలో అధికంగా నివసించే ప్రాంతాలైన ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ లలో తెలంగాణలో కాంగ్రెస్ చేసిన మోసాలు బాగా ప్రచారం అయ్యాయి. హేమంత్ సోరేన్ పై బీజేపీ పార్టీ పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ తీర్పుతో జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదు. జార్ఖండ్ లో విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు’ అని హరీష్ రావు తెలిపారు. 


Also Read: Maharastra Elections: పని చేయని రేవంత్ మ్యాజిక్ - పవనే హైలెట్ - మహారాష్ట్ర ఫలితాలపై తెలుగు నేతల ప్రభావం