బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్తను చంపించడానికి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని జమున తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు రూ.20 కోట్ల సుపారీ కూడా కుదిరిందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నాననే ఆరోపణలు పెద్ద జోక్‌ అని కౌశిక్‌ రెడ్డి కొట్టిపారేశారు. ఈటల జమున చెప్పిన విషయాలు అన్నీ అబద్ధాలు అని ఖండించారు.  బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టారు.


నన్ను చంపేందుకే కుట్ర చేశారు - కౌశిక్ రెడ్డి


తనపై చేసిన ఆరోపణలపై హుజూరాబాద్‌ నడిబొడ్డులో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. తనను హత్య చేసే ఉద్దేశంతోనే ముందే బట్టకాల్చి మీద వేస్తున్నారని అన్నారు. హత్యా రాజకీయాలు చేసేది తాను కాదని, ఈటల రాజేందరే అని కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్‌ తనను 2018 లోనే చంపించేందుకు పన్నాగం పన్నారని కౌశిక్ రెడ్డి రివర్స్ ఎటాక్ చేశారు. 


ఈటల రాజేందర్‌ భార్య జమున గతంలో ముదిరాజ్‌లను చిన్న కులంగా మాట్లాడి అవమాన పరిచారని అన్నారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈటల రాజేందర్‌‌కు ఒకప్పుడు ఇల్లు కూడా సరిగ్గా లేదని, ఇప్పుడు రూ.వందల కోట్లతో ఐదు ఎకరాల కోట ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, బీసీల భూములు లాక్కున్నారని విమర్శించారు. ఈటలను ఓడించే వరకు తాను విశ్రమించేది లేదని అన్నారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఈటల రాజేందర్ ఆగం ఆగం అవుతున్నారని, అందుకే అన్ని పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని కౌశిక్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.


‘‘ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్‌గా మారారు. కోళ్లఫారాలు పెట్టుకున్న వ్యాపారులు దివాళా తీస్తుంటే ఈటల రాజేందర్‌ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు బంగారు గుడ్లు పెడుతున్నాయా? రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించడానికి తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమర వీరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’’ అని కౌశిక్ రెడ్డి మాట్లాడారు.