Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి ఇన్‌కం ట్యాక్స్ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. రూ. 8 కోట్ల ఇన్‌కం ట్యాక్స్ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సకాలంలో పన్ను కట్టని కారణంగా మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా కట్టాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 


కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఆదేశించారు. ఐటీ చట్టం 147 కింద రూ.8,644,49,041 పన్ను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పన్నును సకాలంలో చెల్లించని కారణంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) సీ ప్రకారం రూ.3,49,71,341 ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) డీ ప్రకారం మరో రూ. 20 వేలు, ఐటీ చట్టం 271 (ఎఫ్) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని, మొత్తంగా రూ. 12 కోట్లకు పైగా సొమ్మును తక్షణం చెల్లించాలని హైదరాబాద్ సర్కిల్ ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది.


బీజేపీ సర్కారు తన చేతిలోని ఐటీ శాఖను ప్రత్యర్థి పార్టీలపై ఎక్కుపెట్టడానికే కాకుండా.. దేవాలయాలకు చెందిన ఆస్తులపై గురిపెట్టేందుకు కూడా ఉపయోగిస్తోందని మరోసారి నిరూపితం అయిందంటూ భక్తులు మండిపడుతున్నారు. ఐటీ రిటర్నులు సమర్పించకపోతే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం సాధారణమే.. అయినా ఆధ్యాత్మిక సంస్థల విషయంలో ఐటీ శాఖ వారికి మార్గదర్శనం చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు తమకు వచ్చే ఆదాయాన్ని లాభాపేక్ష లేకుండా ఖర్చు చేస్తాయని.. లెక్కల విషయంలో ఏదైనా తేడాలు ఉంటే ఐటీ శాఖ సరిచేయాలని చెబుతున్నారు. ధార్మిక సంస్థలపై జరిమానాలు విధించడంలో ఆచితూచి వ్యవహరించాలని, వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్లు కఠిన వైఖరిని అవలంబించకూడదని సూచిస్తున్నారు.