సిద్ధిపేట: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. సిద్దిపేటలోని  హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ (TS Minister Konda Surekha) ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న జాతర (Komuravelli Jatara ) ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నేతను స్టేజీ పైకి పిలిచారు. ఓడిపోయిన వారిని స్టేజీ మీదకి ఎలా పిలుస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం 
కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై హరిత హోటల్లో ప్రభుత్వ అధికారిక సమీక్షలో కాంగ్రెస్‌ నేత కొమ్మూరిని స్టేజీపైకి పిలిచారు మంత్రి కొండా సురేఖ. అయితే దీనికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదని.. రాజకీయ వేదిక లాగా ఓడిపోయిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట మంత్రి కొండా సురేఖ... ఎమ్మెల్యే పల్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నేత వినలేదు. దాంతో విసుగు చెందిన కొండా సురేఖ.. మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపొండి అని చెప్పేశారు. తన మాటలకు విలువ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ సమావేశంలాగ ఓడిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమరవెల్లి మల్లన్న జాతర సమీక్ష సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు మళ్లీ మొదలైందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.


దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు!
కొమురవెల్లి మల్లన్న నిధులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలను పిలుస్తున్నారని పల్లా ఆరోపించారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ హోటల్ లో ఇలాంటి సమావేశం నిర్వహించలేదని, కాంగ్రెస్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని సమావేశాన్ని తాను బహిష్కరించినట్లు ఎమ్మెల్యే పల్లా చెప్పారు. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. సమావేశంలో ఉండటం ఇష్టంలేకనే పల్లా వెళ్లిపోయారని పేర్కొన్నారు. జాతర ఏర్పాట్ల పనుల కోసం తాము ఎవరినైనా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. కానీ పల్లా మాత్రం ప్రోటోకాల్ పేరు చెప్పి, సమావేశాన్ని బహిష్కరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏమైనా తప్పిదాలు జరిగితే కలెక్టర్ చెబుతారు కానీ, పల్లా మాత్రం ప్రతి విషయాన్ని రాద్దాంతం చేయాలని చూశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.