రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అని, నేడు ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్‌తో కేటీఆర్‌కి ఏమీ తెలియదని అర్థం అయిపోయిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బానిసత్వ పార్టీ ఎవరిదో తెలిసిపోతోందని అన్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో కదలిక లేదని అన్నారు. ‘‘మా చెల్లిని అరెస్ట్ చేయకండి ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండని కేటీఆర్ అమిత్‌ షాకి చెప్పి వచ్చారు’’ అని కోమటిరెడ్డి ఆరోపించారు.


కేసీఆర్‌ను గతంలో బండ భూతులు తిట్టిన దానం నాగేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని పార్టీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రక్రియ మొదలు పెట్టిన సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని, రెండో దశ ప్రక్రియ మొదలు అయిన వెంటనే తెలంగాణకు వచ్చారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ కోసం తమతో పొత్తు పెట్టుకున్నాడని, అప్పట్లో వైఎస్‌ వద్దు అంటున్నాకానీ తాము ఎదిరించి మాట్లాడామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చింది అంటే, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్నాడని అన్నారు. అసలు కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని కోమటిరెడ్డి అన్నారు. 


రాష్ట్రంలో ఎంతో మంది కాలేజీ పిల్లలు చనిపోతున్నారని ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారని అన్నారు. అలాంటిది ఆ తెలంగాణ పేరుతో ఇప్పుడు కేటీఆర్ లక్షల కోట్లకు అధిపతి అయ్యారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేటీఆర్. వెంట ఉన్న వారు అంతా తెలంగాణ ద్రోహులే. దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు మీ పార్టీలో ఉన్నారు. పువ్వాడ అజయ్ కి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏముంది. సీహెచ్ మల్లారెడ్డి పాలు, పూలతో పాటు భూములు కూడా అమ్ముకున్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు. తెలంగాణ ద్రోహులు అంతా మీ వెనుకే ఉన్నారు. 


బానిసలుగా బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పద్మ దేవేందర్‌ రెడ్డిని కేసీఆర్ బానిసల్లాగా చూస్తున్నారు. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా? హోం మినిస్టర్ గా ఉన్న మహమూద్ అలీ కేసీఆర్ చేతికి దట్టీ కట్టడానికి తప్ప దేనికీ పనికిరాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమాన్షు రావు ముఖ్యమంత్రి అవుతారు.


కాంగ్రెస్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. సోనియా గాంధీని ఇంకోసారి అంటే పాపం తగులుతది. సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు కేటీఆర్? ప్రభుత్వానికి ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దడం రాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు కానీ.. మాపై మాట్లాడుతున్నారు’’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ధ్వజమెత్తారు.