Komatireddy Rajagopal Reddy announces rebellion for ministerial post:  మంత్రి పదవి ఇస్తారో లేదో మీ ఇష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారని.. భువనగిరి ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. తాను ఎవరి కాళ్లు పట్టుకుని పదవి తెచ్చుకోలేనని స్పష్టం చేశారు. అలాగని తాను ఊరుకునేది లేదన్నారు. మంత్రి పదవి కోసం తాను ఎంత దూరం అయినా వెళ్తానని.. దిగజారి బతకడం తకు తెలియదన్నారు.  పార్టీ మారిన వారికి, తన కంటే చిన్న వారికి పదవులు ఇచ్చారని.. తాను సీనియర్‌నని చెప్పకొచ్చారు. 

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ లో సామాజిక సమీకరణాలు కలసి రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. అందులో ఒకరు ఆయన సోదరుడు కోమటిరెడ్డి రెడ్డి. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో కూడా రెడ్డి సామాజికవర్గానికి మరో స్థానం కేటాయించే పరిస్థితి లేదు. ఒకే జిల్లాకు మూడు పదవులు అదీ ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం సాధ్యం కాదు. రాజగోపాల్ రెడ్డికి పదవి కేటాయించాలంటే ఆయన సోదరుడితో రాజీనామా చేయించాలి.                         

అయితే కోమటిరెడ్డి  వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి చాలా కాలం సీఎంగా ఉండాలని ఆయన పూజలు కూడా చేయిస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ ను విమర్శిస్తున్నారు. ఇటీవల తాను పదేళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పిన మాటల్ని సోషల్ మీడియాలో ఖండించారు. రెండు రోజుల కిందట జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. రేవంత్ రెడ్డితో నేరుగా ఆయన తలపడేందుకు సిద్ధమయ్యారని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.     

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పదవుల విషయంలో మొదటి నుంచి పంచాయతీ పెట్టుకుంటూనే ఉన్నారు. 2019లో మునుగోడు నుంచి ఆయన గెలిచారు. కానీ పార్టీ ఓడిపోయింది. అయితే ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు.  బీజేపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చాలా కాలం ఆయన చేరిక ఆగిపోయింది. ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీలో చేరి ఉపఎన్నిక తీసుకు వచ్చారు. బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడిందన్న అభిప్రాయం బలపడగానే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు పీసీసీ చీఫ్ పదవి కోసం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత కోమటిరెడ్డి సర్దుకున్నా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గడం లేదు.