Komatireddy Rajagopal Reddy announced  he will soon become a minister:  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు త్వరలోనే మంత్రి పదవి దక్కుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.                         

Continues below advertisement

త్వరలోనే జరగబోయే క్యాబినెట్ విస్తరణలో తనకు ఖచ్చితంగా చోటు లభిస్తుందని ఆయన అత్యంత ధీమా వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవలో తాను ఎప్పుడూ ముందుంటానని, పార్టీ కోసం తాను చేసిన కృషిని అధిష్టానం గుర్తిస్తుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే శుభవార్త వింటారని, మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.                

గతంలో మంత్రి పదవి రాలేదని పదే పదే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన ఇటీవలి కాలంలో సైలెంట్ గా ఉంటున్నారు. మంత్రివర్గంలో ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. కానీ మొత్తం కేబినెట్ ను ప్రక్షాళన చేసి ఐదారుగుర్ని తొలగించి కొత్త వారికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఈ అంశంపై తరచూ మాట్లాడుతున్నారు. తనకు మంత్రి పదవి చేపట్టే ఉద్దేశం లేదంటున్నారు. ఆయన మాటలు కసరత్తు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటన చేయడం వెనుక అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చి ఉంటుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.   

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. ఇద్దరూ సీనియర్లే. కోమటిరెడ్డి  వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి రెడ్డి సాామాజికవర్గ నుంచి మరో నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండదు. అయితే మొత్తం కేబినెట్ ను ప్రక్షాళన చేయాలనుకుటున్నారు కాబట్టి ఆయన సోదరుడు వెంకటరెడ్డిని తప్పించి ...రాజగోపాల్ రెడ్డికి చాన్స్ ఇస్తారని అనుకుంటున్నారు.  వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకుంటారని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కోమటిరెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.  మంత్రి పదవి ఇవ్వకపోతే దేనికైనా తెగిస్తానన్నట్లుగా రాజగోపాల్ వ్యవహరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్  హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయం  ఆసక్తి కలిగిస్తోంది.