TSRTC Bus Accident : ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండె పోటు రావడంతో అతడు బస్సులోంచి కిందకు దూకేశాడు. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న TS 20Z 0015 సూపర్ లగ్జరీ బస్సు ఆసిఫాబాద్ లోని అయ్యప్ప గుడి సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ సదయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో అతను హఠాత్తుగా బస్సులోంచి కిందకు దూకేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన ఆర్టీసీ బస్సులో 7 గురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆసిఫాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు ఛాతిలో నొప్పి రావడంతోనే బస్సులో నుంచి దూకేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ కి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తాపడిన ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.  



శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం


 శ్రీశైలం ఘాట్ రోడ్డులో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ఇటీవల పెనుప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొట్టిన బస్సు శ్రీశైలం లోయలో పడబోయి, అంచున నిలిచింది.  శ్రీశైలం డ్యాం వద్ద గత ఆదివారం(జనవరి 29) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొట్టింది.  గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది. లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించేదని ప్రత్యక్షసాక్షులు అంటున్నారు.  


డ్రైవర్ కు హార్ట్ ఎటాక్, స్టీరింగ్ కంట్రోల్ చేసిన బాలిక


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. స్కూల్‌ బస్‌ నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నట్టుండి గుండె పోటు వచ్చింది. స్టీరింగ్‌పై పట్టు కోల్పోవడాన్ని గమనించిన ఓ విద్యార్థిని వెంటనే గమనించి ధైర్యంగా ముందుకొచ్చింది. స్టీరింగ్‌ను పట్టుకుని బస్‌ అదుపు తప్పకుండా కంట్రోల్ చేసింది. పాదచారులపైకి బస్ వెళ్లకుండా స్టీరింగ్‌ను తిప్పి కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది. ఆ బాలిక సమయస్ఫూర్తితో  తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాస్త ధ్వంసమైంది. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం...డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోవడం వల్ల బస్ రాంగ్‌ రూట్‌లో దూసుకుపోయింది. బస్‌లో ఉన్న 17 ఏళ్ల భార్గవి వ్యాస్‌ డ్రైవర్ సీట్‌ వైపు పరిగెత్తుకొచ్చింది. డ్రైవింగ్‌ తెలియకపోయినా స్టీరింగ్‌ను పట్టుకుని కంట్రోల్ చేసింది. నేరుగా కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టింది. గుండెపోటుకు గురైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


"మా స్కూల్‌లో ఇవాళ ఓ ప్రోగ్రామ్ ఉంది. అందరం ముందుగా వెళ్లాల్సి ఉంది. కానీ బస్ లేట్‌గా వచ్చింది. ఎక్కిన వెంటనే నేను డ్రైవర్‌ను ఎందుకు లేట్ అయిందని అడిగాను. ఆయన ఏ సమాధానమూ ఇవ్వలేదు. బస్‌ నడుపుతుండగానే చేతులు వేలాడేసి పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగ్‌ చేతుల్లోకి తీసుకున్నాను. నాకు తోచినంత వరకూ కంట్రోల్ చేశాను. ఆ సమయంలో రోడ్‌పై చాలా మంది ఉన్నారు. కాస్త అటు ఇటు అయినా వారిపైకి బస్ దూసుకుపోయేదే. స్టీరింగ్‌ను పూర్తిగా బెండ్ చేయడం వల్ల పక్కనే ఉన్న కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది" - భార్గవి వ్యాస్