BRS Sarpanches Resign : కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 18 మంది సర్పంచులు రాజీనామా చేశారు. తమ గ్రామాల అభివృద్ధికి నిధులు సక్రమంగా ఇవ్వడం లేదని, స్థానిక ఎమ్మెల్యే సైతం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కుమ్రం భీమ్ జిల్లాలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు కూడా వేయలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది సర్పంచ్ లు రాజీనామా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా తాము గెలిచామన్నారు. తామంతా స్వతంత్రులుగా గెలుపొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తుందని, తమను ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ లో చేరామని స్పష్టం చేశారు.


  ప్రజలు నిలదీస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం 


ముఖ్యంగా ఆదివాసీ గూడెల్లో, గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని, తమకు సమయం కేటాయించాలని కోరినా స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడం లేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆదివాసీల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇక తాము పార్టీలో ఉండి ఏం లాభమని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు సైతం తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం చివరి దశకు వచ్చినా కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేకపోతున్నామని అన్నారు. భూప్రక్షాళన తరువాత చాలా మంది రైతులకు కొత్త పట్టాలు రాలేదని తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని, కొత్త రేషన్ కార్డులు రాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు నిలదీస్తున్నారని వారి ముందు తలెత్తులేకపోతున్నామన్నారు. అందుకే తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.



రాజీనామా  చేసిన సర్పంచ్ లు 


కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 18 మంది సర్పంచ్ లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో  1.సిడాం అన్నిగా - చౌపన్ గూడ,  2.కొట్నాక కిష్టు - పాటగూడ, 3.కొర్కెట దేవురావ్ - సావురి, 4. కొర్వెత జంగు - చిచ్చుపల్లి, 5.సెడ్మాకి దౌలత్ రావ్ - గోయగాం, 6.జుగ్నక మనోహర్ - వెల్గి, 7.పెందూర్ పవన్ - ఖమాన, 8.అడ జైరాం – నవేధరి, 9.మడావి లింగుబాయి - దొడ్డిగూడ, 10.సెడ్మకి గంగారాం - ఖిరిడి, 11. మడావి బాలు -నవేగామ్, 12. మడావి రేణుక - నవేగూడ, 13. కోటాక సుమిత్ర - ధాబా, 14. కినక గంగూబాయి - సోనాపూర్, 15. పెందూర్ సుగంధబాయి - ఖమ్మర్ గాం, 16. రాయిసిడాం మంగళ - కోమటిగూడ, 17.ముచ్చినేని పోసక్క,  18.తాటికుమారి - లెండిగూడ సర్పంచులు ఉన్నారు.