Kishan Reddy News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రకాశ్ జవదేశకర్.. కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కిషన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామన్నారు. కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు నిన్న భగ్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంతో యువతకు అన్యాయం జరిగిందంటూ కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24గంటల దీక్షను బుధవారం ఉదయం చేపట్టారు. అయితే ఆయన దీక్షకు సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉందంటూ పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కిషన్ రెడ్డి మాత్రం తాను గురువారం ఉదయం 6 గంటల వరకు ఉపవాస దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తన దీక్ష భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులను కిషన్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేపడితే ప్రభుత్వం కుట్ర పూరితంగా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తుంటే, ఉద్రిక్తతల నడుమ పోలీసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని దీక్షా శిబిరం నుంచి లాగి పడేసిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల సమస్యపై శాంతియుతంగా దీక్ష చేస్తే అరెస్ట్ చేయడం దారుణం అన్నారు కిషన్ రెడ్డి. పోలీసులతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్క్ లో దీక్షా శిబిరం నుంచి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆయనను తరలించారు. అక్కడే ఇవాళ దీక్ష విరమించారు.