Indiramma Houses Sand Transport Forest Issue: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధిలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య కొన్నిరోజులుగా రగులుతున్న తీవ్ర వివాదం చివరకు అధికారులపై వేటుతో కీలక మలుపు తిరిగింది. అటవీశాఖ అధికారులు తమ తీరు మార్చుకోకపోతే ఖానాపూర్ నియోజకవర్గంలోనే వారికి వ్యతిరేకంగా ఒక వ్యతిరేక సామ్రాజ్యం ఏర్పాటు చేస్తామని, సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేసిన సంచలన హెచ్చరికలు ఫలించాయి. ఆదివాసీలపై దాడి చేసిన ఇంధన్‌పల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా మారిన మంచిర్యాల జిల్లా జన్నారంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అటవీశాఖ వైఖరిపై విరుచుకుపడ్డారు. గిరిజనులపై ప్ర చేయి చేసుకున్న ఇంధన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు తపాలాపూర్, ఉడుంపూర్, ఖానాపూర్ రేంజ్ అధికారులపైనా తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పేరిట నిబంధనలను సాకుగా చూపిస్తూ అటవీ సిబ్బంది సాగిస్తున్న వేధింపులను ఇకపై సహించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అటవీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే వ్యక్తంచేసిన తీవ్ర ఆగ్రహం ఏజెన్సీలో ప్రజా ఆగ్రహానికి అద్దం పట్టింది. అటవీ ప్రాంతంలోకి స్థానిక గిరిజనులను రానివ్వని అధికారులు.. మరి గ్రామీణ ప్రాంతాల్లోని రెవెన్యూ భూముల్లోకి ఎలా వస్తారు అని ఆయన సూటిగా నిలదీశారు. కనీసం నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, కంకరను కూడా తెచ్చుకోకుండా అధికారులు అడ్డుపడటం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గిరిజన పల్లెలకు చేరకుండా అటవీ నియమావళి పేరిట అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే హెచ్చరికలతో పాటు అఖిలపక్ష నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్ధమవుతుండటంతో అటవీ ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బాధ్యుడైన రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణపై విచారణకు ఆదేశించి, ప్రాథమిక ఆధారాల ఆధారంగా ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉడుంపూర్, తపాలాపూర్ ప్రాంతాల్లో గిరిజనులతో ఏర్పడిన ఘర్షణ పూరిత వాతావరణాన్ని చక్కదిద్దేందుకు, రెవెన్యూ ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అధికారులపై చర్యలతో జన్నారం, ఖానాపూర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత కొంత మేర సడలినప్పటికీ.. కవ్వాల్ టైగర్ జోన్ సరిహద్దు గ్రామాల్లోని గిరిజనుల పొడు భూములు, మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. జన్నారం సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నందు నాయక్, మేకల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఇతర కుల సంఘాల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
