Kerala communists are using the Khammam demolition for their politics: ఖమ్మం నగరంలో భూదాన్ భూముల్లో ఆక్రమణల కూల్చివేతలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు కేరళలో మాత్రం ప్రధాన ప్రత్యర్థులు కావడంతో, ఈ కూల్చివేతలను అక్కడి ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా మార్చుకున్నారు.
కేరళలో కాంగ్రెస్‌పై సీపీఎం ట్విట్టర్ అస్త్రం!
ఖమ్మం నగరంలో ఆక్రమణలను తొలగిస్తున్న తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో పేదల ఇళ్లను అమానవీయంగా కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది" అంటూ ఆయన చేసిన విమర్శ, కేరళలోని మైనారిటీ, పేద వర్గాల ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంగా కనిపిస్తోంది.
కొంటర్ ఇచ్చిన పొంగులేటి
కేరళ సీఎం విమర్శలపై తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో జరుగుతున్నవి కేవలం ఆక్రమణల తొలగింపు మాత్రమేనని, భవిష్యత్తులో వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి చర్యలను తప్పుగా చిత్రీకరించడం పినరయి విజయన్‌కు తగదు అంటూ పొంగులేటి సూచించారు. కేరళలో తమ ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణను బలిపశువును చేయాలని చూడటం సరికాదని ఆయన ఘాటుగా స్పందించారు.
సోషల్ మీడియాలోనూ చర్చ
సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. కేరళలోని సీపీఎం అనుకూల హ్యాండిల్స్ ఖమ్మం కూల్చివేతల వీడియోలను షేర్ చేస్తూ, కాంగ్రెస్ పేదల వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం.. కేరళలో గతంలో జరిగిన వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టిన నిర్వాసితుల తరలింపు ఫోటోలను బయటకు తీస్తోంది. అక్కడ చేస్తే అభివృద్ధి.. ఇక్కడ చేస్తే అరాచకమా అంటూ నెటిజన్లు సీపీఎం వైఖరిని ప్రశ్నిస్తున్నారు.
ఖమ్మంలో కూల్చివేతలకు గురవుతున్న వారిలో మెజారిటీ ప్రజలు పేదలు , మధ్యతరగతి వారే కావడంతో స్థానిక సీపీఎం నాయకత్వం కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ వస్తే అలాంటి కూల్చివేతలు ఉంటాయని కేరళ ఓటర్లను భయపెట్టడానికే పినరయి విజయ్ ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నయి.
