దళిత బంధు పథకం అమలుపై స్వయంగా పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నేరుగా కరీంనగర్ వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన సూచనలుచేశారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం పనిచేస్తానని ప్రకటించారు. "నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని సీఎం కేసీఆర్‌ దళితులకు హామీ ఇచ్చారు.  దళిత జాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సమాజమే కారణమన్నారు. దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని సీఎం కేసీఆర్‌ సమీక్ష సందర్భంగా పిలుపునిచ్చారు. 


హుజురాబాద్‌లో దళిత కుటుంబాలను గుర్తించడానికి సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎలా సాగుతోందని అధికారులను కేసీఆర్ అడిగారు. అలాగే ఎక్కువ మంది లబ్దిదారులు ఏ యూనిట్లు అడుగుతున్నారో ఆరా తీశారు.  బ్యాంక్ అకౌంట్ల వివరాలు జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల అందజేత సమయంలో పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.  ఆగస్టు 16వ తేదీన రైతు బంధు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందించిన వారికి గురువారమే యూనిట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం దళిత బంధు సర్వే హుజురాబాద్‌లో జోరుగా సాగుతోంది. నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 
 
దళితబంధు పథకానికి పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న 20,929 దళిత కుటుంబాలన్నింటికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. రెండు వేల కోట్ల రూపాయలను కలెక్టర్‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. మొత్తం రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది.  పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకుంది. నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు చక చకా అమలు చేయడమే మిగిలింది.


ఒకటి, రెండు నెలల్లో పథకం అమలును పూర్తి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉపఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఇందు కోసం అధికార యంత్రాంగాన్ని సంపూర్ణ స్థాయిలో వినియోగిస్తున్నారు. దళిత బంధు అమలు ప్రత్యేకాధికారి సీఎంవో నుంచి రాహుల్ బొజ్జా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కరీంనగర్‌లోనే మకాం వేశారు. సర్వే పూర్తయిన తర్వాత ఎక్కువ మంది అడిగే యూనిట్లు.. వారికి కావాల్సిన శిక్షణ అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.