Invitation For KCR : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయనది రాజకీయ పర్యటన కాదు. అధికారిక పర్యటనే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం వరంగల్‌లో నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం లభిస్తుంది. ఇప్పుడు కూడా కేసీఆర్‌కు అలాంటి ఆహ్వానం వచ్చింది. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇంకా ఎలాంటి ప్రకటనా ప్రభుత్వ వైపు నుంచి రాలేదు.
ఇటీవలి కాలంలో ప్రధాని కార్యక్రమాలకు హాజరు కాని సీఎం కేసీఆర్
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ లో రైల్వేశాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన ఉంది. అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఆ తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పాల్గొనేవన్నీ అధికారిక పర్యటనలే. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లిన అక్కడి సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలపై ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ పై విమర్శలు చేసినా సరే .. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇష్టపడలేదు.
గతంలో ప్రధాని వచ్చినప్పుడల్లా తలసానికి స్వాగతం చెప్పే బాధ్యతలు
గతంలో చినజీయర్ ఆశ్రమంలో సమతా విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినప్పుడు కానీ.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి వచ్చినప్పుడు కానీ ఆయన స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ బాధ్యతలిచ్చారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగింది. సీఎంను ఆహ్వానించలేదని ఓ సారి బీఆర్ఎస్ మంత్రులు విమర్శించారు..కానీ ఆహ్వానం పంపామని కేంద్ర మంత్రులు ఖండించారు. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది కానీ..ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు ఉన్నా .. తెరపైకి వస్తూనే ఉంది.
మారిన రాజకీయ పరిస్థితులు - కేసీఆర్ మనసు మార్చుకుంటారా ?
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. బీజేపీపై కేసీఆర్ యుద్ధం దాదాపుగా ఆపేశారు. విమర్శలు కూడా చేయడం లేదు. తప్పని సరి సందర్భం వస్తే .. కాంగ్రెస్, బీజేపీ రెండింటిని విమర్శిస్తున్నారు. బయటకు చెప్పకపోయినా రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం మాత్రం లేదని.. తేలిక పడిందని అందరికీ స్పష్టత వచ్చింది. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే ఆయనకు కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది అంచనా వేస్తున్న విషయం. అయితే ఇలా ఆహ్వానం చెబితే రెండు పార్టీల మధ్య అవగాహన నిజమేనని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఆహ్వానించలేదు..ఇప్పుడెందుకు ఆహ్వానించారని ప్రశ్నించేవారు ఉంటారు.
ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది శుక్రవారంలోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.