KCR On Accident : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.కర్ణాటకలోని కలబురిగి జిల్లా కమలాపురలో గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును మినీ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కలబురిగిలోని మూడు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, బాధితులు అంతా బొల్లారంలోని రిసాలాబజార్‌కు చెందినవారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బర్త్‌డే వేడుకలు విషాదంగా ముగిశాయి. బర్త్ డే వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించుకుని.. హైదరాబాద్‌కు వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు బుగ్గిపాలైంది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జీవన్(4), దీక్షిత్ (9), రవళి(30), సరళాదేవి(32), అర్జున్(37), శివకుమార్(35), అనితరాజు(40)గా గుర్తించారు. ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు.
ఉదయం 6:30 గంటల సమయంలో బీదర్ – శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో అర్జున్ కుమార్ కుటుంబం ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంక్‌ను టెంపో వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడి క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలు చెలరేగే సరికి బస్సులో ఉన్న కొందరు అప్రమత్తమై కిటికీలను పగులగొట్టి కిందకు దూకారు. తమ కండ్ల ముందే బస్సులో ఉన్న వారు సజీవదహనం కావడంతో మిగతా వారు బోరున విలపించారు. ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.