RTC strike:  తెలంగాణ రాజకీయ చరిత్రలో 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె ఒక పెను సంచలనం. కేసీఆర్ ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన ఆ సుదీర్ఘ పోరాటం అనేక మలుపులు తిరిగింది.   2019 అక్టోబరు 5న, సరిగ్గా దసరా పండుగకు ముందు రోజున ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, జీతాల పెంపు వంటి 26 డిమాండ్లతో సుమారు 48 వేల మందికి పైగా కార్మికులు విధులను బహిష్కరించారు. పండుగ సమయంలో ప్రజలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నా, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని కార్మిక సంఘాల జేఏసీ  భీష్మించుకూర్చుంది.

Continues below advertisement

కేసీఆర్ కఠిన నిర్ణయం సెల్ఫ్ డిస్మిస్                             

సమ్మెపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత కఠినంగా స్పందించారు. ప్రభుత్వం విధించిన గడువు  లోపు విధుల్లో చేరని వారందరూ  తమంతట తామే ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో కేవలం 1,200 మంది మాత్రమే ఉద్యోగులు మిగిలారని, మిగిలిన వారందరినీ తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమ్మె కాలంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను నియమించి బస్సులను నడిపింది.  సుమారు 52 రోజుల పాటు సాగిన ఈ సమ్మెలో అనేక విషాదాలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాలు పోతాయన్న భయంతో, ఆర్థిక ఇబ్బందులతో సుమారు 25 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం,  గుండెపోటుతో మరణించడం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. 

Continues below advertisement

హైకోర్టు జోక్యంతో విరమణ                            

ఈ వివాదం హైకోర్టుకు చేరింది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. కానీ, ప్రభుత్వం చర్చలకు మొగ్గు చూపలేదు. చివరికి, నవంబరు 25న కార్మిక సంఘాలు ఒక అడుగు వెనక్కి వేసి, ఎటువంటి షరతులు లేకుండా సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. తాము విధుల్లో చేరతామని చెప్పినప్పటికీ, ప్రభుత్వం వెంటనే వారిని అనుమతించలేదు, దీనితో మరో రెండు రోజులు సందిగ్ధత కొనసాగింది.

ప్రగతి భవన్‌లో విందుతో సుఖాంతం                                      

నవంబరు 28న కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని, కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  కార్మికులు నా బిడ్డలు, వారు యూనియన్ నాయకుల మాట విని తప్పుదారి పట్టారు  అని పేర్కొంటూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రగతి భవన్‌లో కార్మికులతో కలిసి భోజనం చేసి, ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను వారిపై పెట్టారు. అలా ఒక తీవ్రమైన పోరాటం ఊహించని విధంగా సుఖాంతమైంది.