KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీ ప్రవేశపెట్టే రోజున అసెంబ్లీకి బీఆర్ఎస్ వస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిసింది. ఇదే జరిగితే ప్రతిపక్ష నేతగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అయినట్లు అవుతుంది.


జూలై 24న బుధవారం తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆరోజున ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపానికి కేసీఆర్ నివాళి అర్పించనున్నారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి వచ్చి సభకు హాజరు అవుతారని అంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు అవుతారు. 


తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో కేసీఆర్ లేవనెత్తనున్నారు. ఏపీలో శాంతిభద్రతల నిర్వహణా వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు బకాయిలు జమ తదితర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది.