KCR camp office attacked in Gajwel: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శనివారం జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తుముకుంట అంక్షా రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి దూసుకెళ్లారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడంపై నిరసన తెలుపుతూ, వారితో తెచ్చుకున్న సీఎం ఫోటోను అక్కడ గోడకు తగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కార్యాలయ ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం కావడంతో గజ్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్లు ఉన్నారు అని చేసిన వ్యాఖ్యలే ఈ అరాచకాలకు ప్రేరణ అని ఆమె మండిపడ్డారు. సీఎం స్థాయి వ్యక్తి రౌడీ భాషలో మాట్లాడటం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి బదులు గూండా రాజ్యం నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ఉండేదని, ఇప్పుడు అల్లకల్లోలం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న హైడ్రా కూల్చివేతలు, భూముల సేకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గజ్వేల్ దాడి కేవలం ఒక కార్యాలయంపై జరిగిన దాడి కాదని, ఇది ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాజకీయాలు వద్దు అని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు.
ఈ ఘటనను మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని, బీహార్ గ్యాంగ్‌లను తలపించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అనేది ప్రభుత్వ ఆస్తి అని, దాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గజ్వేల్ లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
