Kavitha will announce her new party on April 25th :  తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కొత్త పార్టీతో తెరపైకి సవ్తున్నారు.  రాష్ట్ర ఏర్పాటు ఆశయాలైన  నీళ్లు, నిధులు, నియామకాలు ఆశించిన స్థాయిలో నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడేందుకు కొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.  ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు  మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు.  

Continues below advertisement

మేము ఎవరికీ  బీ టీమ్ కాదు 

ప్రెస్ మీట్ వేదికగా కవిత తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఎప్పుడు కొత్త పార్టీ పెట్టినా ఇతర పార్టీలకు  బీ  టీమ్ అని ముద్ర వేయడం పరిపాటిగా మారిందని, తాము ఎవరికీ తొత్తులం కాదని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ స్వచ్ఛమైన తెలంగాణ ప్రాంతీయ పార్టీ అని, భవిష్యత్తులో రాష్ట్రంలో  నంబర్ వన్ పార్టీగా అవతరించబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడే ఇంటి పార్టీ గా జాగృతి పనిచేస్తుందన్నారు.  తాను నిజామాబాద్ గడ్డపై పుట్టిన బిడ్డనని, ఆ మట్టిలో పుట్టిన ఏ ఆలోచనైనా దేశంలో విజయవంతమైందని కవిత గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా సాధ్యం కాలేదని ఆమె విమర్శించారు. ఇబ్బందులు పడుతున్న ప్రజల గొంతుకగా మారేందుకే ఈ కొత్త పార్టీ ఆవిర్భవిస్తోందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

Continues below advertisement

బీఆర్ఎస్ క్యాడర్‌పై గురి 

బీఆర్ఎస్ పార్టీలోని అట్టడుగు స్థాయి కార్యకర్తలు మొత్తం తన వెంటే ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తనతో కలిసి నడిచిన శక్తులన్నీ కొత్త పార్టీకి అండగా నిలుస్తాయని చెప్పారు. పార్టీలో యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి నాయకత్వంలోనే రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధివిధానాలు ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ సమాజం ప్రస్తుతం మార్పును కోరుకుంటోందని, ఆ మార్పును తమ పార్టీ ద్వారా తీసుకువస్తామని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 25న జరగబోయే బహిరంగ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. 

సర్వోదయ తెలంగాణ నినాదం                    

 సర్వోదయ  అంటే అందరి అభ్యుదయం. గాంధేయవాద స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలకు సమాన ఫలాలు అందడమే దీని లక్ష్యం.  కొత్త పార్టీలో యువతకు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, వారి నాయకత్వంలోనే రాష్ట్ర రాజకీయాలను మారుస్తామని చెప్పారు.