Kavitha letter to KCR Responce:  కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ  దెయ్యాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల వల్లనే ఇలా బయటకు వచ్చిందన్నారు. 

Continues below advertisement


కేసీఆర్‌కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానన్నారు. పాజిటివ్, నెగటివ్ ఎప్పుడూ లెటర్స్ రాస్తుంటానని తెలిపారు. దాన్ని ఎవరూ లీక్ చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాలన్నారు. నా లెటర్ పట్టుకుని కాంగ్రేస్, బీజేపీ పండగ చేసుకుంటున్నాయ్..నా నాయకుడు కేసీఆర్ - ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకెళ్తుందిని తెలిపారు. కోవర్టులను పక్కకు జరుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. 


కవిత రాక గురించి విస్తృత ప్రచారం జరగడంతో ఎయిర్ పోర్టుకు తెలంగాణ జాగృతికి చెందిన నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సారి వారు మొత్తం తెలంగాణ జాగృతి రంగు అయిన నీలి రంగు బ్యానర్లను వెంట తెచ్చుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి వారి పేర్లు , ఫోటోలను తమ బ్యానర్ల మీద కనిపించనివ్వలేదు. సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నిస్తున్న కవిత అనే పోస్టర్లు హైలెట్ అయ్యాయి. కవితకు ఇలా సామాజిక తెలంగాణ  పేరుతో స్వాగతం చెప్పడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. 


సొంతపార్టీ అంశంపై కవిత స్పష్టత ఇవ్వలేదు కానీ.. పార్టీలో కోవర్టులున్నామని ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడం వెనుక కవిత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ చుట్టూ ఉన్న వారు తనను కలవనివ్వకపోవడమో.. లేకపోతే తన గురించి లేనిపోనివి చెప్పి ప్రాధాన్యత లేకుండా చేయడమో చేశారని కవిత భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ చుట్టూ ఉండేవారు అత్యంత సన్నిహితులే అయి ఉంటారు. కేసీఆర్ దగ్గరకు నేరుగా యాక్సెస్ ఉండే లీడర్లు కొంత మంది ఉంటారు. వారిలో కేటీఆర్,హరీష్ రావుతో పాటు  కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వంటి వారు ఉంటారు. వీరినే దయ్యాలుగా చెబుతున్నారా అన్న సందేహాలు పార్టీ నేతలు వస్తున్నాయి. 


లేఖ బయటకు రావడం వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు లేఖ ఎందుకు.. ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ లేఖ బయటకు రావడమే కాదు.. కవితనే లీక్ చేశారన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ ఆ లీక్ పార్టీలోని కోవర్టుల పనేనని కవిత అంటున్నారు. తానే లేఖ రాశానని కవిత స్పష్టంగా ఒప్పుకున్నారు. పైగా అందులో పర్సనల్ ఏమీ లేదని కూడా వాదించారు.తాను లేఖ రాయడంలో తప్పు లేదని కానీ.. ఆ లేఖ బయటకు రావడంపైనే కవిత ఆగ్రహం కనిపిస్తోంది. గతంలో కూడా లేఖలు రాశానని అవి బయటకు రాలేదని..ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చాయని ఆమె సందేహం. 


పరిస్థితి చూస్తూంటే.. ఈ లేఖ వివాదం బీఆర్ఎస్‌‌లలో చిచ్చు పెట్టేలానే ఉంది. కేసీఆర్ ఈ దెయ్యాలను దూరం పెట్టకపోతే కవిత పార్టీకి మరింత దూరంగా జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్దోంది.