Kavitha made key remarks addressing KCR: హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూనే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సభ ప్రారంభంలో కవిత తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మరణార్థం ఉద్యమకారులందరితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అసలు సిసలు ఉద్యమకారులు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంపై సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై కవిత తొలిసారిగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమకారులకు సహాయం చేయాలని కోరితే, అసలు ఉద్యమకారులు ఎవరు అని అధికారులు అడిగే దుస్థితి ఉండేది అని ఆమె వ్యాఖ్యానించారు. నాడు ఉద్యమకారుడు నాగులు అసెంబ్లీ ముందే ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, ఉద్యమకారులంటే ఎవరో మనకు మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వంలో ఉండేదని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి.
రేవంత్ రెడ్డికి బంగ్లా హెచ్చరిక
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఉద్యమకారుల ఆకాంక్షలను వెంటనే నెరవేర్చండి. ఆ పెద్దమనిషి ఉద్యమకారులను పట్టించుకోనందుకే అధికారాన్ని కోల్పోయారు. మీరు కూడా అదే తప్పు చేస్తే, ఉద్యమకారులు మిమ్మల్ని బంగ్లా బయటకు గుంజుతారు అని ఘాటుగా హెచ్చరించారు. ఉద్యమకారులకు పెన్షన్లు, గౌరవ వేతనాలు , నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం 1995లోనే వరంగల్ డిక్లరేషన్‌తో ఉద్యమం మొదలైందని కవిత అన్నారు. మారోజు వీరన్న, గద్దర్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ప్రజాసంఘాల నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారుని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని తాను గతంలో ప్రయత్నించిన విషయాన్ని కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వారికే నేడు గుర్తింపు కరువైందనే ఆవేదన సభలో వ్యక్తమైంది.
రాజకీయ అస్తిత్వం కోసమేనా?
తెలంగాణ జాగృతిని తిరిగి యాక్టివ్ చేస్తూ, సొంత తండ్రి పాలనను విమర్శించడం ద్వారా కవిత తన స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. ఉద్యమకారుల ఓటు బ్యాంకును ఆకర్షించడంతో పాటు, గత ప్రభుత్వ వైఫల్యాలను సొంత గొంతుకతోనే అంగీకరించడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత పొందే ప్రయత్నంగా ఈ సభ కనిపిస్తోంది. గతంలో ఆమె ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పారు. వారి కష్టాలకు కన్నీరు పెట్టుకున్నారు.
