Who is the Nizababad BRS candidate : బీఆర్ఎస్‌లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్  ( KTR ) ఆధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో అభ్యర్థులపై సూచన ప్రాయంగా సంకేతాలు ఇస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై చర్చ జరిగినప్పుడు.. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే సమస్య వచ్చిందని.. ఈ సారి అలాంటి తప్పు చేయబోమన్నారు. రెండు సార్లు గెలిచిన ఎంపీ బీబీ పాటిల్ కు ఈ సారి టిక్కెట్ లేదని సంకేతాలు ఇచ్చారని బీఆర్ఎస్ లో చెప్పుకున్నారు. ఇప్పుడు  సోమవారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కవిత  (  Kavitha ) పోటీ చేస్తారని ఖచ్చితంగా చెప్పలేదు. దీంతో ఈ సారి ఎంపీగా కవిత బరిలోకి దిగుతారా లేదా అన్నదానిపై సస్పెన్స్ ప్రారంభమయింది. 


నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున కొత్త అభ్యర్థి 


నిజామబాద్ నియోజకవర్గం నంచి కవిత  ఓ సారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే  బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతనూ తీసుకున్నారు. అయితే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను  మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అక్కడ  బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచినట్లయింది. అయినా లోక్ సభ ఎన్నికల్లో కవితకు  పూర్తి స్థాయిలో మద్దతుగా ప్రజలు ఉంటారని ఆమె అక్కడి నుంచే పోటీ చేస్తారని అనుకుంటున్నారు. 


నియోజకవర్గ సమీక్షలో కవిత పేరుపై స్పష్టత ఇవ్వని కేటీఆర్           


అయితే హఠాత్తుగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమీక్షలో కవిత పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆమె పోటీకి వెనుకడుగు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి  మరో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉందని చెబుతున్నారు. కవిత నిజామాబాద్ నుంచి  పోటీ చేయడం లేదా అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అన్నదానిపై స్పష్టత లేదు. సీటు మారే అవకాశాలపైనా చర్చ  జరుగుతోంది. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశాన్ని కవిత పరిశీలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 


మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ?                            


నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేయకపోతే.. పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. బరి నుంచి పారిపోయారని విమర్శలు ఎదురవుతాయని అంటున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తో కవిత తీవ్రంగా పోటీపడ్డారు. రాజకీయ పరమైన విమర్శలు పరిధి దాటి మరీ చేసుకున్నారు. చాలా సందర్భంగాల్లో అడ్డుకోవడాలు.. ధర్నాలు కూడా జరిగాయి. ఇలాంటి సందర్భంలో నిజామాబాద్ నుంచి కవితనే పోటీ చేయాలన్న అభిప్రాయం వారి క్యాడర్ నుంచి వినిపిస్తోంది.