Jagruti Working Committee: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సంస్థను స్వతంత్ర రాజకీయ శక్తిగా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఎజెండా కమిటీ సభ్యులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక సాంస్కృతిక సంస్థగా కాకుండా, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రోడ్‌మ్యాప్ రూపొందించే రాజకీయ పార్టీగా జాగృతి రూపాంతరం చెందబోతోందని ఆమె స్పష్టం చేశారు.
జాగృతిని రాజకీయ శక్తిగా మార్చేందుకు గట్టి ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను అధ్యయనం చేయడానికి కవిత ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాథమిక నినాదంతో పాటు మొత్తం 32 కీలక అంశాలపై ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి బ్లూప్రింట్‌ను సిద్ధం చేయడమే ఈ కమిటీల ప్రధాన బాధ్యత. కేవలం ప్రాంతీయ పార్టీగానే కాకుండా, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, జాగృతి కోసం ఒక సరికొత్త , అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగాన్ని రూపొందించాలని కవిత నిర్ణయించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, పారదర్శకత ఉండేలా నిపుణుల కమిటీ ఈ ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఇది రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని ఆమె భావిస్తున్నారు.
ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలపై అధ్యయనం కమిటీలు ఈనెల 17వ తేదీలోకా తమ నివేదికలను వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికల ఆధారంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి, పార్టీ అధికారిక ప్రకటన , భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగానే తమ రాజకీయ ప్రయాణం ఉంటుందని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజల గొంతుకగా నిలిచే మరో శక్తి అవసరమని జాగృతి భావిస్తోంది. గత ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపుతూనే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచడం ద్వారా బలమైన రాజకీయ పక్షంగా ఎదగాలని కవిత వ్యూహరచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ 'జాగృతి' రాజకీయ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.