Kavitha political fight will also be against her father KCR : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపునకు మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెరతీశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన రాజకీయ ప్రయాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు స్పష్టం చేస్తూ, ప్రస్తుతం పార్టీ అజెండాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గాంధీజీ ప్రతిపాదించిన సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని, సామాజిక సమానత్వమే లక్ష్యంగా తన పార్టీ విధివిధానాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
తన పోరాటం ఎవరి మీదో స్పష్టం చేశారు. డాడీ , మోడీ , చిన్న మోడీ లపై తన యుద్ధం ఉంటుందని కవిత వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ పై కూడా రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారనుంది. బడా భాయ్ అనిమోదీని పిలిచే రేవంత్‌ను..కవిత చిన్నమోడీ అని ప్రస్తావించారు. ఒక మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తానని కవిత చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత సమస్యలను కాంగ్రెస్ పార్టీ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కవిత ఆరోపించారు. తనకూ, తన కుటుంబానికీ మధ్య జరుగుతున్న ఇష్యూను అడ్వాంటేజ్‌గా తీసుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై జరుగుతున్న ఈ కుట్రలను ప్రజల ముందు ఉంచుతానని, స్వతంత్రంగా ప్రజల గొంతుకగా నిలబడతానని స్పష్టం చేశారు.
అంతకు ముందు కవిత ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన తెలంగాణ ప్రజా జాగృతి (TPJ) పార్టీ నమోదు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు , కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్వకుంట్ల కవిత సమర్పించిన దరఖాస్తుపై వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా, కవిత దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని కోరుతూ ఇప్పటికే ఆమెకు సమాచారం అందించినట్లు ఈసీ కోర్టుకు తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో, కొత్త పార్టీ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రజా జాగృతి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుందని సమాచారం. గతంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఉన్న నెట్‌వర్క్‌ను ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు కొత్త సవాలుగా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.
