Kalvakuntla Kavitha apologizes : తాను తెలంగాణ ప్రజలు వదిలిన బాణాన్నని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తనను ఎవరూ ఆదేశించలేరన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జాగృతి జనం బాట పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు , బీఆర్ఎస్ పార్టీతో తనకున్న ప్రస్తుత సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 19 ఏళ్లుగా జాగృతి ద్వారా ప్రజల్లోనే ఉన్నానని, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం తెలియదని, ఉరి వేసే వ్యక్తికి కూడా కారణం చెబుతారని, కానీ తనకు ఆ కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని పొరపాట్లలో తాను కూడా భాగస్వామినేనని కవిత బహిరంగంగా అంగీకరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో ఆలేరు ప్రాంత రైతులపై బేడీలు వేసిన ఘటనపై ఆవేదన వ్యక్తంమ చేశారు. అప్పుడు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది, అందుకే ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను అని పేర్కొన్నారు. తనను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేయడం వల్ల రాష్ట్రంలోని ఇతర సమస్యలను పట్టించుకోలేకపోయానని, తన ప్రవర్తన ద్వారా మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని కవిత ఆరోపించారు. పెద్దల భూములను కాపాడటం కోసం పేదల భూములను బలి పెడుతూ అలైన్‌మెంట్లు మార్చుతున్నారని విమర్శించారు. దీనిపై జనవరి 5న హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఆన్‌లైన్ మూమెంట్‌ను కూడా చేపడతామని వెల్లడించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా చుక్క నీరు రాలేదని, నిర్వాసితులకు సరైన పరిహారం అందలేదని ఆమె ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అని, ఆయన అంతర్గతంగా బీజేపీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. భువనగిరి జిల్లాలోని పలు సమస్యలపై కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎయిమ్స్ (AIIMS) భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, అందులోని ఉద్యోగాల్లో స్థానికులకే 80 శాతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలేరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, చేనేత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ. 50 కోట్ల నిధుల విడుదల, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. రాజకీయాల కోసం కాకుండా, కేవలం జనం సమస్యల పరిష్కారం కోసమే జాగృతి పనిచేస్తుందని, జిల్లా పర్యటనల్లో తేలిన ప్రతి సమస్యను పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.