Kavitha allegations against Santosh Rao BRS : కేసీఆర్ పక్కన దెయ్యాల్లో మొదటి స్థానం సంతోష్ రావుదేనని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వచ్చిన సమయంలో సంతోష్ రావును టార్గెట్ చేశారు. కేసీఆర్ చుట్టూ ఒక ఇనుప గొలుసులా మారి, ఆయనను బాహ్య ప్రపంచానికి, చివరకు సొంత కుటుంబ సభ్యులకు కూడా దూరం చేసింది సంతోష్ రావేనని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ప్రగతి భవన్ గేటు వద్ద గంటల తరబడి నిలబడినా లోపలికి రానివ్వలేదని, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నేతలు పార్టీ వీడటానికి కూడా ఆయనే ప్రధాన కారణమని ఆమె మండిపడ్డారు. కేసీఆర్‌ను అందరి నుంచి ఐసోలేట్ చేసి, పార్టీకి అత్యంత నష్టం కలిగించిన వ్యక్తిగా సంతోష్ రావును ఆమె అభివర్ణించారు.
సంతోష్ రావు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని కవిత చేసిన ఆరోపణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ వ్యక్తిగత విషయాలను, ఆయన ఆహారపు అలవాట్ల నుండి రాజకీయ వ్యూహాల వరకు ప్రతి చిన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ అర ఇడ్లీ తిన్నారా.. పూర్తి ఇడ్లీ తిన్నారా అన్న విషయాన్ని కూడా చేరవేస్తారన్నారు. సంతోష్ రావు కేవలం రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చుట్టూ ఉన్న కోటరీని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చిందని, అందుకే ఇలాంటి వ్యక్తుల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
సంతోష్ రావు వల్ల కేవలం పార్టీకే కాదు, కుటుంబానికి కూడా తీరని నష్టం జరిగిందని కవిత మాటల్లో స్పష్టమవుతోంది. కవితకు, కేసీఆర్‌కు మధ్య దూరం పెరగడానికి, తండ్రీకూతుళ్ల మధ్య తప్పుడు సమాచారంతో చిచ్చు పెట్టడానికి సంతోష్ రావు నిరంతరం ప్రయత్నించారని ఆమె ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో కూడా తనకు ఆశించిన స్థాయిలో పార్టీ నుంచి మద్దతు లభించకపోవడం వెనుక సంతోష్ రావు హస్తం ఉందని కవిత గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
అయితే కవిత ఆరోపణలు బీఆర్ఎస్ అగ్రనేతల్లో పెద్దగా కదలిక సృష్టించడం కష్టమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఇప్పటికే సొంత పార్టీ ప్రయత్నాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ను బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగా నే హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. వారి ట్రాప్ లో పడకూడదని పార్టీ ముఖ్యలు..ఎవరూ ఇలాంటి అంశాలపై స్పందించవద్దని సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.