Who is Mallojula Venugopal Rao: తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు.. అన్న పిలుపుతో ఉద్యమ బాట
Maoist Venugopal rao | మూడు దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు.

గడ్చిరోలి: మావోయిస్టులపై పోరాటంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు భారీ విజయం సాధించారు. ఎలాంటి రక్తపాతం లేకుండా, ఒకేసార 61 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు గడ్చిరోలి పోలీసుల వద్దకు వెళ్లి లొంగుబాటు విషయం చెప్పారు. ఆయనతో పాటు మరో 60 మంది ఆయుధాలు వీడతారని స్పష్టం చేశారు. అయితే మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే లొంగిపోతానని.. అప్పుడే తన లొంగుబాటు ప్రకటన చేయాలని కండీషన్ పెట్టారు.
ఈ విషయాన్ని గడ్చిరోలి పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు తెలిపారు. మంచి కోసం తాను ఓ అడుగు ముందుకేశారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్, సోను అలియాస్ భూపతి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సాయుధ మార్గాన్ని విడిచిపెడుతున్న సందర్భంగా ఫడ్నవీస్ చేతికి తన తుపాకీ సమర్పించారు. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి జన జీవన స్రవంతిలోకి రావాల్సిన మల్లోజుల కోరిక నెరవేరింది. మల్లోజులతో పాటు 60 మందికి పైగా సహచర మావోయిస్టులు బుధవారం ఉదయం ఫడ్రవీస్ సమక్షంలో గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు
గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. 61 మంది మావోయిస్టుల లొంగుబాటు అవుతున్నారని సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు సీఎం ఫడ్నవీస్, పోలీసులకు తమ ఆయుధాలను సమర్పించారు. భూపతి అలియాస్ సోనుతో పాటు, మరో ఇద్దరు ప్రముఖ మావోయిస్టులు.. మొత్తం 61 మంది ఆయుధాలను వీడారు.
ఎవరీ మల్లోజుల వేణుగోపాల్ రావు.. ఆయనపై 6 కోట్ల రివార్డ్
ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మహారాష్ట్ర వైపు ఉన్న దక్షిణ గడ్చిరోలి జిల్లాలోని దట్టమైన అడవిలో మావోయిస్టులు లొంగిపోవాలని నిర్ణయం ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. గడ్చిరోలి చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు ఇది. అయితే మల్లోజుల వేణుగోపాల్ రావు పేరు ప్రముఖంగా వినిపించింది. ఎవరీయన మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ భూపతి నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా నిలిచారు.

తెలంగాణలోని పెద్దపల్లి చెందిన మల్లోజుల
మూడు దశాబ్దాలకు పైగా పోలీసులు, భద్రతా బలగాలకు ముచ్చెమటలు పట్టించిన మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణలోని పెద్దపల్లికి చెందినవారు. మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో తండ్రి వెంకటయ్య పాల్గొన్నారు. చిన్ననాటి నుంచి తండ్రి ప్రభావం పిల్లలపై ఉండేది. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వేణుగోపాల్, ఆయన రెండో అన్న కోటేశ్వరరావు పిలుపుతో ఉద్యమబాట పట్టారు. చదువు అయ్యాక అన్న పిలుపు మేరకు అడవిబాట పట్టి ఉద్యమంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడు స్థాయికి చేరారు. మల్లోజుల మీద రూ.6 కోట్ల రివార్డ్ ఉందని గడ్చిరోలి పోలీసులు తెలిపారు.
రాష్ట్ర మావోయిస్టు దళానికి నాయకత్వం వహించిన మల్లోజుల కొంతకాలం నుంచి ఆయుధాలు వీడాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గడ్చిరోలి పోలీసులను ఆశ్రయించి లొంగుబాటు గురించి చెప్పారు. ఆయన కండీషన్ మేరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గడ్చిరోలి పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా అక్కడ మల్లోజుల వేణుగోపాల్, 60 మంది లొంగిపోయారు. అభయ్ అనే పేరుతో మావోయిస్టు పార్టీ తరఫున లేఖలు విడుదల చేసేవారు. మావోయిస్టు పార్టీలో ఆయనను భూపతి, అభయ్, వివేక్ అనే పేర్లతో పిలిచేవారని సమాచారం.






















