Siddipeta Train Services: సిద్దిపేటకు రైలు సర్వీసులు ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. మనోహరాబాద్ - కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జులై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో కానీ సిద్దిపేట రైల్వే లైన్ సిద్ధం కాబోతుంది. ప్రస్తుతం సిద్దిపేట సమీపంలో దుద్దెడ వరకు పూర్తి స్థాయి ట్రాక్ ఏర్పాటు పూర్తి కాగా.. అక్కడి నుంచి సిద్దిపేట చేరువ వరకు తాత్కాలిక ట్రాక్ ఏర్పాటు పూర్తయింది. సిద్దిపేట బైపాస్ వరకు ఆ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రతిపాదికన పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే రైల్వే సేఫ్టీ కమిషనర్ దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతి ఇవ్వగానే రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గజ్వేల్ వరకు లైన్ నిర్మాణం పూర్తయిన వెంటనే గతేడాది అక్కడి నుంచి నగరానికి ప్యాసింజర్ రైలు నడపాలని నిర్ణయించారు. కానీ కరోనా ఆంక్షలతో ఇందుకు ఆటంకం ఎదురు అయింది.
సిద్దిపేట నుంచి సరిపడా ప్రయాణికులు లేరనే ఉద్దేశ్యంతో..!
తర్వాత ప్రారంభించాలని భావించినా గజ్వేల్ నుంచి నిత్యం నగరానికి ఓ రైలుకు సరిపడా ప్రయాణికులు ఉండరన్న అభిప్రాయంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ భావన తప్పని సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గానీ ముంబయికి గానీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని అధికారులు యోచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డు ఏర్పాటు
సిద్దిపేట రైల్వే స్టేషన్ భవనం నిర్మాణం చాలా వేగంగా సిద్ధం అవుతోంది. దీంతో పాటు సరుకు రవాణాకు భారీ గూడ్సు యార్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్ లైన్, రెండు లూప్ లైన్లు, ఒకటి గూడ్సు లైను, ట్రాక్ మెయింటెనెన్స్ కు వినియోగించే ట్రాక్ మిషన్ కోసం సైడింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ ఫామ్స్ 750 మీర్ల పొడవుతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న రైల్వే శాఖ, అందుకోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గజ్వేల్ లో 600 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన సరుకు రవాణా యార్డు బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.